అనుమతి లేని వెంచర్లు.. అక్రమ రిజిస్ట్రేషన్లు

అనుమతి లేని వెంచర్లు.. అక్రమ రిజిస్ట్రేషన్లు
  • నాలా కర్వషన్‌‌‌‌‌‌‌‌తో అనధికార లేఔట్లలో జోరుగా ప్లాట్ల విక్రయం
  • పట్టించుకోని ఆఫీసర్లు.. ప్రభుత్వ ఆదాయానికి గండి
  • ఇంటి నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు తప్పవంటున్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు

వరద కాల్వను పూడ్చి వెంచర్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ పరిధిలోని సర్వే నంబర్ 252లోని దాదాపు 1.20 ఎకరంతోపాటు, 253లో 14గుంటల భూమిని కలిపి  ప్లాట్లుగా చేశారు. ఈ క్రమంలో మామిడికుంట వరద కాలువను మట్టితో పూర్తిగా నింపి వరద నీరు వెళ్లేందుకు నామమాత్రంగా చిన్న కాల్వను నిర్మించారు. డీటీసీపీ అనుమతుల్లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్ లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.  

 కాగితాలపైనే ప్లాటింగ్

ఈ ఫొటోలో కనిపిస్తున్న లేఔట్ మ్యాప్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కొత్తగా వెలిసిన వెంచర్ ది. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ వెంచర్ చుట్టూ ఇటీవల ప్రహరీ నిర్మించారు. 30 ఫీట్ల ప్రపోజ్డ్ రోడ్డు,121, 150, 180 గజాల చొప్పున ఇలా కాగితంపైనే 68 ప్లాట్లతో ప్లాటింగ్ చేశారు. ఈ మ్యాప్ ను, అక్కడి స్థలాన్ని చూపించి పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్లాట్లు అమ్మేందుకు యత్నిస్తున్నారు. అయితే చదును చేసి సిద్ధం చేసిన ఈ భూమి ఇంకా రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూమిగానే ఉండడం, నాలా కన్వర్షన్ చేయకపోవడం గమనార్హం. 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నాన్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్ల విక్రయం మళ్లీ జోరందుకుంది. రెవెన్యూ ఆఫీసర్లు నాలా కన్వర్షన్ చేయడం.. సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం ‘మామూలై’పోయింది. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను నాలా కన్వర్షన్ ద్వారా నాన్ అగ్రికల్చర్ భూములుగా మార్చి అమ్మేస్తున్నారు. మరికొందరు నాలా కన్వర్షన్ లేకుండానే ప్లాట్లు చేసి గుంటల చొప్పున విక్రయిస్తున్నారు.

రోడ్లు, డ్రైనేజీ, ఇతర సౌకర్యాలు, డీటీసీపీ, రెరా, సుడా అనుమతులు లేకుండానే కొనుగోలుదారులకు ప్లాట్లను అంటగడుతున్నారు. లేఅవుట్ ప్లాట్లతో పోల్చితే ఇలాంటి వెంచర్లలో తక్కువ ధరకు ప్లాట్లు లభిస్తుండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసి చిక్కుల్లో పడుతున్నారు. ఇలాంటి ప్లాట్లు కొనుగోలు చేస్తే భవిష్యత్ లో ఇళ్ల నిర్మాణ సమయంలో ఇబ్బందులు తప్పవని టౌన్ ప్లానింగ్, పంచాయతీ ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు.

సిటీ చుట్టూ 30 కి.మీ పరిధిలో నాన్ లేఅవుట్ ప్లాట్లు 

కరీంనగర్ సిటీ శివారుతోపాటు చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో నాన్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వ్యవసాయ భూములను చదును చేసి.. ప్లాటింగ్ చేసి, హద్దు రాళ్లు పాతి 150, 200, 300 గజాల చొప్పున అమ్మేస్తున్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోని హైవేలకు సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి వెంచర్లు ఇటీవల ఎక్కువయ్యాయి. 2020 తర్వాత ఇలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించారు.

కానీ ఏడాదిగా గతంలో అమ్ముడుపోని వెంచర్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో ఇదే అదనుగా.. మళ్లీ కొత్తగా నాన్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ వెంచర్లు వెలుస్తున్నాయి. లేఅవుట్‌‌‌‌‌‌‌‌ ప్లాట్ల ధరలతో పోలిస్తే ధర సగమే ఉండడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు ధరణి వచ్చినప్పటి నుంచి ఫామ్ ల్యాండ్స్ పేరిట రెండు గుంటల నుంచి 10 గుంటల వరకు ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కు ఇంత అని రేట్ ఫిక్స్ చేసి.. ఇలాంటి అక్రమాలకు తహసీల్దార్లు సహకరిస్తున్నారు.  

అనుమతుల్లేకపోయినా ఆఫీసర్లు పట్టించుకోరు 

కరీంనగర్ సిటీ పరిధితోపాటు చుట్టూ సుడా పరిధిలోని గ్రామాల్లో వెంచర్లకు డీటీసీపీ, సుడా అనుమతులు తప్పనిసరి.  వెంచర్ విస్తీర్ణం కనీసం ఎకరంపైనే ఉండాలి. అధికారిక అనుమతులు పొందాలంటే నిబంధనల ప్రకారం లేఅవుట్‌‌‌‌‌‌‌‌లో 33 ఫీట్లతో తారు లేదా సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. పార్కు, కమ్యూనిటీ హాల్, ఆట స్థలాల కోసం 10 శాతం ఓపెన్ స్పేస్ వదలాలి మొత్తం 20 శాతంలో పచ్చదనం కనిపించాలి.

కానీ ఇవేమి లేకుండానే ప్లాటింగ్ చేస్తున్నారు. రోడ్లు, ప్లాట్ సైజులతో కాగితాలపైనే మ్యాప్ లు వేయించి అమ్మేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఇలాంటి నాన్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ వెంచర్లను గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సుడా అధికారులు అరికట్టాల్సి ఉండగా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వెంచర్లు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. 

అనధికార లేఅవుట్లలో కొంటే ఇబ్బందులు.. 

తక్కువ రేటులో ప్లాటు వస్తుందని అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొంటేభవిష్యత్ లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా అనుమతులు రావు. అవసరానికి  అమ్ముకోవాలన్నా రేటు రాదు. కొన్నవారు నష్టపోతారు. నాన్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ వెంచర్లలో  రోడ్ల కోసం తీసిన స్థలాలను కూడా  తర్వాతి కాలంలో పట్టాదారు వేరొకరికి ప్లాట్ల కింద రిజిస్ట్రేషన్ చేసే ప్రమాదముంది. దీంతో  ప్లాట్ల ఓనర్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అథరైజ్డ్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌లో కొంటేనే అన్ని రకాల సౌకర్యాలతోపాటు భరోసా ఉంటుంది. అన్ అథరైజ్డ్ లేఅవుట్లపై సమాచారమిస్తే  చర్యలు తీసుకుంటాం. -కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్