- వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు ప్రత్యేక ‘సమ్మర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించేందుకు మండల స్థాయి అధికార బృందాలతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. జలాశయాల నీటి మట్టాలను రోజూ పర్యవేక్షిస్తూ, ప్రభుత్వం నిర్ణయించిన కనీస డ్రా-డౌన్ స్థాయిలను పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
బల్క్ నీటి సరఫరాలో ఆటంకాలు రాకుండా పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి 24 గంటల్లోనే మరమ్మతులు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. నీటి శుద్ధి కేంద్రాల్లో గ్యాస్ క్లోరిన్, లిక్విడ్ క్లోరిన్, పాలీ అల్యూమినియం క్లోరైడ్ వంటి రసాయనాలను 3 నెలలకు సరిపడా ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు. రోజూ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి, ప్రమాణాలకు అనుగుణంగానే సరఫరా కొనసాగించనున్నారు.
ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గాల్లో రోజూ మంచినీటి సరఫరా వివరాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తూ, సమస్యలు రాకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. తాగునీటికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 1916 ద్వారా వచ్చిన ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకుంటున్నారు.
