- పేషెంట్‌ను ఏ హాస్పిటల్‌కు పంపుతున్నారు.. ఎందుకు పంపుతున్నారో చెప్పాలి
- రోగి వెళ్లే ముందే సదరు హాస్పిటల్‌కు సమాచారం ఇవ్వాలి
- వచ్చాడా.. లేదా? అడ్మిట్ అయ్యాడా? ఆరా తీసేలా ట్రాకింగ్ సిస్టం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఇకపై ఇష్టారాజ్యంగా పేషెంట్లను ఇతర హాస్పిటళ్లకు రిఫర్ రాస్తామంటే కుదరదు. జిల్లాల నుంచి వచ్చే చిన్నచిన్న కేసులను కూడా హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్‌కు పంపిస్తుండటంతో..ఇక్కడ పేషెంట్ల రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ భారాన్ని తగ్గిం చడంతో పాటు ప్రజలకు తమ సమీప ప్రాంతాల్లోని హాస్పిటల్స్‌లోనే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇకపై జిల్లాల కేసులను జిల్లా కేంద్రాల్లో, సమీప హస్పిటల్స్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకునేలా పకడ్బందీ రిఫర్ సిస్టమ్‌ను అమల్లోకి తేనుంది.
పేషెంట్ వచ్చిన వెంటనే అడ్మిషన్ వివరాలు ఎంటర్ చేయడంతో పాటు ఒకవేళ వేరే హాస్పిటల్‌కు రిఫర్ చేయాల్సి వస్తే.. దానికి గల బలమైన కారణాన్ని కేస్ షీట్‌లో కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. కేవలం చీటీ రాయడం కాకుండా, ఎందుకు రిఫర్ చేస్తున్నాం? ఏ హాస్పిటల్‌కు పంపిస్తున్నాం? అనే పూర్తి వివరాలను రికార్డ్ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది.
పేషెంట్‌ను ట్రాక్ చేయాలి..
ఒక పేషెంట్‌ను రిఫర్ చేసేటప్పుడు, పంపించే హాస్పిటల్ డాక్టర్లు.. పేషెంట్ వెళ్తున్న హాస్పిటల్‌కు ముందే సమాచారం ఇవ్వాలి. పేషెంట్ అక్కడికి చేరుకున్నాడా లేదా? చేరుకుంటే అడ్మిట్ అయ్యాడా లేదా? అనే విషయాలను కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.
అలాగే, ఏ హాస్పిటల్‌లో ఏయే సేవలు ఉన్నాయి? ఎంత మంది డాక్టర్లు అందుబాటులో ఉన్నారు? అనే సమాచారం మొత్తం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు. దీనివల్ల అత్యంత సమీప హాస్పిటల్స్‌లోనే పేషెంట్‌కు అవసరమైన ట్రీట్‌మెంట్ అందించేందుకు వీలు ఉంటుంది.
డిశ్చార్జ్ షీట్‌లో ఆ వివరాలు మస్ట్..
రిఫర్ చేసే సమయంలో ఇచ్చే డిశ్చార్జ్ షీట్‌లో ఇప్పటివరకు సదరు హాస్పిటల్‌లో పేషెంట్‌కు ఏ చికిత్స్ అందించారు? ఇప్పుడు వెళ్లే హాస్పిటల్‌లో ఏ ట్రీట్‌మెంట్ కోసం పంపిస్తున్నారు? అనే విషయాలను డాక్టర్లు సస్పష్టంగా రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి? ఈ కొత్త విధానాన్ని ఎలా పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి? అనే అంశాలపై స్టడీ చేయడానికి ఒక కమిటీని నియమించాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూను మంత్రి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా, డాక్టర్లు జవాబుదారీతనంతో పనిచేసేలా ఈ చర్యలు ఉండబోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
