- కల్తీని ‘హత్యాయత్నం’గా పరిగణించి చర్యలు
- అవసరమైతే పీడీ యాక్ట్
- సిటీ సీపీ సజ్జనార్ గట్టి హెచ్చరిక
బషీర్బాగ్, వెలుగు: నగరంలో ఆహార కల్తీని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రజారోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కల్తీని ‘హత్యాయత్నం’తో సమానమైన నేరంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ టీజీఐసీసీసీలో బుధవారం ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆహార కల్తీ నివారణకు పోలీస్, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం వ్యాపారులే కాకుండా కల్తీకి మూలమైన తయారీ కేంద్రాలపై దాడులు చేపడతామన్నారు. కల్తీ నియంత్రణకు ప్రత్యేక ఎస్‌వోపీ రూపొందించి అమలు చేస్తామని, తనిఖీలు, నమూనాల సేకరణ, సీజ్, అరెస్టుల ప్రక్రియ న్యాయపరంగా పకడ్బందీగా ఉంటుందని చెప్పారు.
పదేపదే కల్తీ కేసుల్లో పట్టుబడితే వ్యాపార లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. కల్తీపై సమాచారం అందించేందుకు త్వరలో ప్రత్యేక వాట్సాప్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభిస్తామని, సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు సీపీ శ్రీనివాసులు, జాయింట్ సీపీ జోయల్ డెవిస్, డీసీపీలు, ఆహార భద్రతా అధికారులు
తదితరులు పాల్గొన్నారు.
