ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ డైలీ సీరియల్ : బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ డైలీ సీరియల్ :  బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
  •     ‘కర్త, కర్మ’ను పిలిచే దమ్ములేదు:
  •     బీజేపీ ఎంపీ రఘునందన్​రావు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్  కేసు విచారణను కాంగ్రెస్  సర్కారు ఓ డైలీ సీరియల్‌లా సాగదీస్తోందని మెదక్  ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సిట్ ఎస్ఐటీ కాస్తా - కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్  టీమ్ లా తయారైందని ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ట్యాపింగ్  కేసులో వేళ్లన్నీ ‘కర్త, కర్మ’ (కేసీఆర్) వైపే చూపిస్తున్నా.. ఆయన్ను పిలిచేందుకు పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల స్టంట్  కోసమే విచారణ చేస్తున్నట్టుందని, కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఈ వ్యవహారం ఉందని విమర్శించారు. 

వాళ్లు కాంగ్రెస్​లో చేరడం వల్లే 

యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వివేక్  వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లు తమ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడం వల్లే ఆ పార్టీ పవర్ లోకి వచ్చిందన్నారు. బీజేపీలో పాత, కొత్త లీడర్లు అనేదేమీ లేదని, ఒకసారి పార్టీలో చేరితే బీజేపీ లీడర్​గానే ఉంటారని చెప్పారు. 

సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీట్లలో లేరని, పాలమూరు, కృష్ణా జలాల మీద ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీశారు. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే అది దేశంలో 6,202వ పార్టీ అవుతుందని రఘునందన్ రావు సెటైర్ వేశారు. ఎవరు కొత్త పార్టీ పెట్టినా తాము స్వాగతిస్తామన్నారు.