- ట్రంప్‌కు లొంగియాడని కామెంట్
- ఇందిరాగాంధీ ధైర్యాన్ని గుర్తుచేస్తూ పాత వీడియో షేర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. టారిఫ్‌ల పేరుతో బెదిరిస్తున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు మోదీ భయపడుతున్నారని అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితిని ఇందిరాగాంధీ ధైర్యంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. మోదీ లీడర్‌షిప్ ఇందిరాగాంధీ నాయకత్వానికి పూర్తి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ 1971లో అప్పటి ప్రధాని ఇందిర అమెరికా ఒత్తిడిని ఎదుర్కొన్నారో చెప్తున్న వీడియోను రాహుల్ షేర్ చేశారు.
ఇదే మోదీకి ఇందిరకు ఉన్న తేడా అని స్పష్టం చేశారు. రష్యాతో వ్యాపారం బంజేయకపోతే భారత్‌పై మరిన్ని టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ రెండ్రోజుల కింద మరోసారి హెచ్చరించారు. దీనినుద్దేశించి రాహుల్.. పీఎం మోదీపై విమర్శలు చేశారు.
ఇందిర ఒక్క అడుగుకూడా వెనక్కి తగ్గలే..
2025లో భారత్, పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణ సమయంలో ట్రంప్ ఫోన్ చేయగానే మోదీ లొంగిపోయారని రాహుల్ ఆరోపించారు. కానీ, 1971లో ఇండియా, పాక్ యుద్ధ సమయంలో అమెరికా ఒత్తిడికి లొంగకుండా భారత్ నిలబడిందని గుర్తుచేశారు. అప్పుడు పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా తన ఏడో నౌకాదళాన్ని పంపినప్పటికీ ఇందిరాగాంధీ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదన్నారు.
తాను చేయాలనుకున్నది చేసి అమెరికాకు గట్టిగా బదులిచ్చారని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు మాత్రం కొంచెం ఒత్తిడికే భయపడి పారిపోతారని, ప్రధాని మోదీకి, ఇందిరాగాంధీకి మధ్య తేడా ఇదేనని రాహుల్ సెటైర్ వేశారు.
