- 139 ఫేక్ ఫారిన్ బాటిళ్లు స్వాధీనం
చందానగర్, వెలుగు : ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపి విక్రయిస్తున్న గ్యాంగ్‌ను శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను బుధవారం చంందానగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి కృష్ణప్రియ వెల్లడించారు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి ఇందిరానగర్ వద్ద బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూట్ వాచ్ నిర్వహించారు.
ఈ సమయంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా 15 నకిలీ గ్లెన్ లివెట్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి. కేపీహెచ్‌బీకి చెందిన ప్రకాశ్ గౌడ్ (29), మాదాపూర్‌కు చెందిన భరత్ (32)ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ప్రకాశ్ గౌడ్ నివాసంలో తనిఖీలు చేయగా బ్లూ లేబుల్, అమృత్, చివాస్, విలియం లాసన్, దివార్స్, టెక్విలా, గ్లెన్‌ఫిడిచ్ వంటి బ్రాండ్లకు చెందిన 46 ఫేక్ బాటిళ్లు దొరికాయి. అతడు ఇచ్చిన సమాచారంతో కొండాపూర్‌లోని మృత్యంజయ మహంతి, మాదాపూర్‌లోని విక్రమ్ భాయ్ ఇండ్లలోనూ తనిఖీలు చేయగా మరో 78 నకిలీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి.
ఈవెంట్లలో ఖాళీ సీసాలు తెచ్చి..
బీర్ కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ గౌడ్ తన సోదరుడు అరవింద్‌తో పాటు పరిచయం ఉన్న భరత్, మృత్యంజయ మహంతి, విక్రమ్ భాయ్‌తో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఈ ముఠా ఈవెంట్లలో వినియోగించిన ఖాళీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లను సేకరించి, వాటిలో ఓసీ, ఓక్స్మిత్ వంటి లిక్కర్‌ను నింపి, గుర్తుపట్టకుండా సీలు మార్చి విదేశీ మద్యం పేరిట విక్రయాలు చేస్తున్నారు.
ఈవెంట్లలో తమకు గిఫ్ట్‌గా వచ్చాయని నమ్మించి తక్కువ ధరకు విక్రయిస్తూ దాదాపు రెండునెలలుగా దందా కొనసాగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తంగా రూ.8 లక్షల విలువైన 139 ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు, 136 ఖాళీ బాటిళ్లు, మూడు స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో జిల్లా టాస్క్‌ఫోర్స్ ఏఈఎస్ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.
