బార్బర్ షాపులకు 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ

బార్బర్ షాపులకు 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ
  • బార్బర్లకు 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ
  • లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు కూడా
  • ఈ నెల 1 నుంచే వర్తింపజేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని బార్బర్ షాపులు, లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం జీవోఎంఎస్ నంబర్–2ను ఆదివారం విడుదల చేశారు. ఈ ఉచిత విద్యుత్తు సరఫరా ఏప్రిల్ 1 నుంచే వర్తింపచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతే  రాష్ట్ర  ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు పరుస్తున్నామని సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా  గ్రామ స్థాయి నుంచి జీహెచ్ఎంసీ దాకా ఉన్న  కటింగు షాపులకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్ల కు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అందుబాటులోకి రానుందని చెప్పారు. కుల వృత్తులు చేసుకునే కుటుంబాలను ఎలక్ట్రికల్ వస్తువుల వినియోగం ప్రోత్సాహించి, శారీరక శ్రమ తగ్గించడానికి, ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు.