కామారెడ్డి జిల్లాలో 25,304 మెట్రిక్ టన్నుల వడ్లు పక్కదారి..ఏసీబీ తనిఖీలతో బట్టబయలైన సీఎంఆర్ అక్రమాలు

కామారెడ్డి జిల్లాలో 25,304 మెట్రిక్ టన్నుల వడ్లు పక్కదారి..ఏసీబీ తనిఖీలతో బట్టబయలైన సీఎంఆర్ అక్రమాలు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా సివిల్ సప్లై డీఎం, సివిల్​ సప్లై ఆఫీస్​ల్లో ఈ నెల 24న జరిగిన తనిఖీ వివరాలను సోమవారం ఏసీబీ అధికారులు వెల్లడించారు.  జిల్లాలో గత 4 ఏండ్లుగా 25,304 మెట్రిక్ టన్నుల వడ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. దీని విలువ రూ. 44. 14 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. రైస్​మిల్లులకు వడ్ల కేటాయింపు, సీఎంఆర్ రికవరీకి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామని పేర్కొన్నారు. 2025 సెప్టెంబర్ నుంచి జిల్లాలోని రైస్​మిల్లులు, ఎంఎల్​ఎస్ పాయింట్లను సివిల్ సప్లై అధికారి, డీఎం తనిఖీ చేయలేదని వివరించారు. 

ఏసీబీ అధికారులు గుర్తించిన వివరాలు..  

2021, -22 వానకాలం సీజన్​లో 39 మంది మిల్లర్లు డిఫాల్ట్ అయ్యారు. ఇందులో 2 మిల్లులపై మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ. 64 లక్షల విలువైన 581 మెట్రిక్​ టన్నుల వడ్లు కొరత ఉన్నట్లు గుర్తించారు. 2022-, 23 వానకాలం​ సీజన్​లో 37 మంది మిల్లర్లు డిఫాల్ట్ కాగా, ఇందులో 2 మిల్లులపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. రూ.41 కోట్ల విలువైన 19,529 మెట్రిక్​ టన్నుల వడ్లు పక్కదారి పట్టినట్లు తేల్చారు. 2023- 24 వానకాలం​ సీజన్​లో ఏడుగురు మిల్లర్లు డిఫాల్ట్ కాగా, ముగ్గురిపై మాత్రమే అధికారులు చర్యలు తీసుకున్నారు.

  రూ.2.5 కోట్ల విలువైన 5,194 మెట్రిక్ టన్నుల వడ్లు కొరత వచ్చాయి.   2023-, 24లో గ్రీన్​ హిల్స్ అగ్రోస్​ కస్టమ్​ మిల్లింగ్ బియ్యం అప్పగించలేదు. సంబంధిత మిల్లు యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయినప్పటికీ మళ్లీ 2024, -25 వానకాలం, యాసంగిలో  వడ్లను ఇదే మిల్లుకు కేటాయించారు.  ఏసీబీ అధికారులు గుర్తించిన దాంట్లో 25,304 మెట్రిక్​ టన్నుల వడ్లకు సంబంధించి కొరత ఉన్నట్లు తేల్చారు. 2025 సెప్టెంబర్​ నుంచి  జిల్లా సివిల్ సప్లై అధికారి, డీఎం లు ఎంఎల్ఎస్ పాయింట్లను, మిల్లులను తనిఖీ చేయలేదని ఏసీబీ తేల్చింది. 

వడ్లు కేటాయించిన తిరిగి ఆయా సీజన్లలో సీఎంఆర్​ రికవరీ చేయటంలో సివిల్ సప్లై జిల్లా అధికారులు డీటీలు డిఫాల్ట్ అయిన మిల్లర్లపై చర్యలు తీసుకోవటంలో విఫలమయ్యారు.  సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. 

డేటా ఎంట్రీ ఆపరేటర్ లావాదేవీలపై ఎంక్వైరీ.. 

జిల్లా సివిల్ సప్లై డీఎం ఆఫీస్​లో డేటా ఎంట్రీ ఆపరేటర్​గా పని చేస్తున్న ఉద్యోగికి  సంబంధించి ఫోన్​లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నారు.  సదరు ఉద్యోగి సెల్​ఫోన్​ను ఏసీబీ అధికారులు తీసుకెళ్లారు. ఏసీబీ సోదాల్లో అక్రమాలు వెలుగుచూడడంతో సంబంధిత యంత్రాంగంలో కలకలం రేగుతోంది.