టెర్రరిస్టులతో లింక్ ఉందని భయపెట్టి ..వృద్ధుడి నుంచి 26 లక్షలు గుంజిన్రు

టెర్రరిస్టులతో లింక్ ఉందని భయపెట్టి ..వృద్ధుడి నుంచి 26 లక్షలు గుంజిన్రు

బషీర్​బాగ్, వెలుగు: టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని భయపెట్టి, ఫేక్​ అరెస్టు వారెంట్​ పంపి ఓ వృద్ధుడి వద్ద సైబర్​ నేరగాళ్లు భారీగా డబ్బు లాగేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. హుమయన్ నగర్ కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి స్కామర్స్ వాట్సాప్ వీడియో కాల్ చేశారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ , ఎన్ఐఏ అధికారులుగా నమ్మించారు.

 ఇటీవల జరిగిన పహల్గాం అటాక్ లో పాల్గొన్న టెర్రరిస్టులకు బాధిత వృద్ధుడు ఫండ్స్ పంపించారని, అందుకు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి, నకిలీ అరెస్ట్ వారెంట్స్​ పంపించారు. ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని తేల్చాలంటే, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులను బదిలీ చేయాలని సూచించారు. 

ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వెరిఫై చేసి, తిరిగి పంపిస్తామని నమ్మించారు. దీంతో వృద్ధుడు తన ఖాతా నుంచి రూ.6 లక్షల 6 వేలు, తన భార్య ఖాతా నుంచి రూ.20 లక్షలను పంపాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా అసలు విషయం  బయటపడింది. రూ.26 లక్షల 6 వేలు పోగొట్టుకున్న బాధితుడు సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశారు.