26 ప్లాట్లకు వేలం..9 మాత్రమే సేల్

26 ప్లాట్లకు వేలం..9 మాత్రమే సేల్

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో 26 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం వేయగా తొమ్మిది మాత్రమే అమ్ముడయ్యాయి. వీటి అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120.92 కోట్ల రెవెన్యూ వచ్చిందని శుక్రవారం హెచ్ఎండీఏ ప్రకటనలో తెలిపింది. అయితే హెచ్ఎండీఏ నిర్ణయించిన ధర కంటే ఎక్కువకు కొన్నరా.. లేదా తక్కువకు కొన్నరా.. ఎవరు కొన్నరు అనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. 

రంగారెడ్డి జిల్లాలో ఎనిమి ప్లాట్లు వేలం వేయగా నాలుగు ప్లాట్లు, మేడ్చల్ జిల్లాలో ఎనిమిది ప్లాట్లకు వేలం నిర్వహించగా ఒక ప్లాట్, సంగారెడ్డి జిల్లాలో 10 ప్లాట్లు వేలం వేయగా నాలుగు మాత్రమే అమ్ముడుపోయాయి. హెచ్ఎండీఏ వేలం వేసిన ప్లాట్లు అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉన్నప్పటికీ స్పందన తక్కువగా ఉండడం గమనార్హం.

 రంగారెడ్డి జిల్లాలో కోకాపేట, చందానగర్, మంచిరేవుల, గండిపేట, నల్లగండ్ల, బుద్వేల్ ప్రాంతాల్లో ప్లాట్లు ఉండగా, మేడ్చల్ జిల్లాలో బాచుపల్లి, సూరారం, బౌరంపేట, సంగారెడ్డి జిల్లాలో రాంచంద్రాపురం, అమీన్ పూర్, పఠాన్ చెరు, కిష్టారెడ్డి పేట ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్లాట్లకు ప్రభుత్వం ఖరారు చేసిన గజం ధరలు కనిష్టంగా రూ.12 వేలు ఉండగా అత్యధికంగా కోకాపేటలో రూ.65వేలు ఉంది.