జమ్మికుంట, వెలుగు : ఫుడ్ పాయిజన్ కారణంగా 26 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ప్రైమరీ స్కూల్‌లో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... సోమవారం మధ్యాహ్నం పిల్లలకు భోజనంతో పాటు ఉడికించిన గుడ్డు అందజేశారు. గుడ్డును తిన్న వెంటనే 26 మంది స్టూడెంట్లు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. గమనించిన టీచర్లు వారిని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కొందరు కోలుకోగా.. వారిని డిశ్చార్జి చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన 17 మందిని హాస్పిటల్‌లోనే అబ్జ్వర్వేషన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న ఎంఈవో హేమలత, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి హాస్పిటల్‌కు వచ్చి స్టూడెంట్లను పరామర్శించారు. ఫుడ్ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నాయకులు హాస్పిటల్ ఎదుట నిరసన తెలిపారు. స్టూడెంట్ల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
