ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

ఏపీలో 262 మంది విద్యార్థులు, 160 మంది టీచర్లకు కరోనా పాజిటివ్

కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో స్కూళ్లు తెరవడం సరికాదని పలువురు హెచ్చరిస్తున్నా…రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను తెరవడానికే ఆసక్తి చూపింది. దీంతో ఈ నెల 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో 9,10 తరగతుల ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలను పునరుద్ధరించారు. రోజు మార్చి రోజు ఒకపూట తరగతులను నిర్వహిస్తున్నారు. అయితే.. బుధవారం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు, టీచర్లకు కరోనా పరీక్షలను నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దాదాపు 262 మంది విద్యార్థులకు, 160 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ అని తేలిందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన్న వీరభద్రుడు తెలిపారు. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఏమీ లేదని ఆయన అన్నారు. అన్ని స్కూళ్లలో కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తున్నామని, అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. నిన్న (నవంబర్-4) రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు స్కూళ్లకు వచ్చారని… వీరిలో 262 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అంటే… కరోనా కేసుల శాతం 0.1 శాతం కంటే తక్కువేనని అన్నారు. పాఠశాలలకు వచ్చినందువల్లే వీరికి కరోనా వచ్చిందని ఆరోపించడం సరి కాదన్నారు. ప్రతి తరగతి గదిలో 15 నుంచి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.