
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీ మందగమనంతో సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఐదేళ్లలో ఇప్పటిదాకా కేవలం 26,259 పోస్టులే భర్తీ అయ్యాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించిన పోస్టులు 40 వేలు కూడా దాటలేదు. మరోవైపు నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నోటిఫికేషన్ల కోసం వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఓటీఆర్లోనే 24,56,442 మంది…
రాష్ట్రంలో సర్కారు కొలువుల భర్తీ కోసం 2014 ఆగస్టు 8న టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆ నెలాఖరు నుంచే కమిషన్ ఫంక్షనింగ్ మొదలైంది. టీఎస్పీఎస్సీలో నిరుద్యోగుల వివరాలను నమోదు చేసుకునేందుకు వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానాన్ని ఏర్పాటు చేయగా, దాంట్లో ఇప్పటిదాకా 24,56,442 మంది అభ్యర్థులు పేర్లను నమోదు చేయించుకున్నారు. దీంట్లో అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 3,07,408 మంది ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఉమ్మడి నల్గొండ 2,94,120 మంది, ఉమ్మడి వరంగల్ 2,93,703 మంది ఉన్నారు. అతి తక్కువగా ఉమ్మడి మెదక్ నుంచి 1,74,354 మంది ఓటీఆర్ ద్వారా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 1.89 లక్షల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. గత ఐదేండ్లలో 39,659 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, నియామకాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీకి పంపించింది. దీంట్లో వివిధ డిపార్ట్‌మెంట్ల నుంచి ఇంకా 3,186 పోస్టులు వివరాలు కూడా టీఎస్‌పీఎస్సీకి అందాల్సి ఉంది. కాగా టీఎస్‌పీఎస్సీ గత ఐదేండ్లలో 135 నోటిఫికేషన్లు విడుదల చేయగా, వాటిలో 101 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఉన్నాయి. మరో 34 డిపార్ట్‌మెంటల్ అండ్ ఆఫ్ ఇయర్లీ, సీఏఎస్ ఎగ్జామ్స్
నోటిఫికేషన్లున్నాయి.
101 నోటిఫికేషన్లు.. 50 లక్షల దరఖాస్తులు….
ఇప్పటివరకు ఐదేళ్లలో టీఎస్‌పీఎస్సీ 36,601 పోస్టుల భర్తీకి (128 గ్రూప్–-1 పోస్టులతో కలిపి) 101 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అత్యధికంగా 2017లో 26,644 పోస్టుల భర్తీ కోసం 51 నోటిఫికేషన్లు ఇచ్చింది. 101 నోటిఫికేషన్లకు 49,04,433 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పురుషులు 30,82,713 మంది ఉండగా, మహిళలు18,21,720 మంది ఉన్నారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఆరున్నర లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. దీంట్లో ఇప్పటివరకూ 26,259 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసింది. మరో 3,494 పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్‌లిస్టులను విడుదల చేసింది. ఇంకో 6,848 పోస్టులు కోర్టు కేసులు, డిపార్ట్‌మెంట్ల నుంచి వెయిటేజీ మార్కులు రాక పెండింగ్‌లో ఉన్నాయి. దీంట్లో గ్రూప్-–2కు సంబంధించిన 1,032 పోస్టుల భర్తీకి తాజాగా అడ్డంకులు తొలిగిపోగా, 4,040 పోస్టులు పారామెడికల్ రిక్రూట్‌మెంట్, 1,486 టీఆర్‌టీ, గురుకుల పోస్టులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. 290 పోస్టులకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి 30 శాతం వెయిటేజీ మార్కుల జాబితా అందలేదని కమిషన్ అధికారులు చెప్తున్నారు.
పోస్టుల చుట్టూ వివాదాలు…
టీఎస్‌పీఎస్సీని సర్కారు భర్తీ చేయాలని ఇచ్చిన కొన్ని పోస్టులకు వివాదాలు తప్పడం లేదు. నోటిఫికేషన్ రాగానే వెంటనే అది కోర్టుమెట్లెక్కుతోంది. 2018 ఏడాది చివరి నాటికే 631 కోర్టు కేసులు నమోదయ్యాయి. మెడికల్ అండ్ హెల్త్, గ్రూప్ –2, టీఆర్‌టీ, గురుకుల టీచర్స్ పోస్టుల భర్తీ వీటిలో ముఖ్యమైనవి. రెండు విడతల్లో 1032 పోస్టులకు గ్రూప్ –2 నోటిఫికేషన్ విడుదల చేయగా, 5.17లక్షల మంది 2016 నవంబర్‌లో పరీక్షకు హాజరయ్యారు. 2017 జూన్ 2న 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 3,147 మంది అభ్యర్థులను టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. అయితే దీంట్లో డబుల్ బబ్లింగ్ ఇష్యూతో కోర్టులో కేసు నడిచి.. వారం క్రితమే పోస్టుల భర్తీకి కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. టీచర్ పోస్టులదీ అదే తీరు. విద్యార్హత, జిల్లాల పంచాయతీ.. ఇలా అనేక రకాల వివాదాలను ఎదుర్కొంది.
కొత్త పోస్టుల కోసం ఎదురుచూపులు…
మన రాష్ట్రం మనకు వస్తే లక్షకుపైగా సర్కార్ కొలువులు దక్కుతాయని ఉద్యమ సమయంలో అటు నాయకులు, ఇటు స్టూడెంట్స్ భావించారు. రాష్ట్రం ఏర్పడగానే పాలకులు కూడా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రం వచ్చి ఐదేండ్లు దాటుతున్నా అరకొరగానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా సరిగ్గా ఉండటం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పోస్టుల కోసం వారు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చిన 36,601 పోస్టులకు సుమారు 50 లక్షల దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. ఇంకా వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా రెండేళ్ల క్రితం 8,792 టీచర్ పోస్టుల భర్తీకే ప్రభుత్వం అంగీకరించింది. అయితే వాటి భర్తీ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. టీఎస్‌పీఎస్సీ కొన్ని పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ విడుదల చేసి, విద్యాశాఖకు అందించినా నియామకాలకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో భర్తీ నిలిచిపోయింది. గ్రూప్–4 పోస్టులకు సంబంధించి గతేడాది నోటిఫికేషన్లు విడుదల చేశారు. మెడికల్ అండ్ హెల్త్, విద్యాశాఖ, సంక్షేమ శాఖల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా, ప్రభుత్వం భర్తీ చేయడం లేదనే
విమర్శలున్నాయి.