
అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (మే 2) రాత్రి ఆత్మకూరు మండలం బైర్లూటి వద్ద బోలేరో వాహనం బోల్తా పడటంతో నలుగురు మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఏడుగురిని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రి తరలించారు. బొలేరో వాహనంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాద సమయంలో బొలేరోలో మొత్తం 25 మంది ఉన్నట్లు గుర్తించారు. బాధితులంతా ఆదోనికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను లక్ష్మి, చంద్రమ్మ, శశికళ, గిడ్డయ్యగా గుర్తించారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.