GT vs SRH: నాటౌట్ అయినా ఔటిచ్చారు: వివాదాస్పద రనౌట్.. డగౌట్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన గిల్

GT vs SRH: నాటౌట్ అయినా ఔటిచ్చారు: వివాదాస్పద రనౌట్.. డగౌట్‌లో అంపైర్‌తో గొడవకు దిగిన గిల్

శుక్రవారం (మే 2) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ రనౌట్ పై వివాదం చెలరేగుతుంది. గిల్ నాటౌట్ అయినా థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడమే ఇందుకు కారణం. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఇన్నింగ్స్ 13 ఓవర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సన్ రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ 13 ఓవర్ చివరి బంతిని బట్లర్ ఫైన్ లెగ్ వైపు కొట్టి సింగిల్ కోసం గిల్ ను పిలిచాడు. హర్షల్ పటేల్ వేగంగా త్రో విసరడంతో బంతి వికెట్లను తగిలింది. 

థర్డ్ అంపైర్ రీప్లేలో చూస్తే మొదట బంతిని క్లాసన్ పట్టుకున్నాడు. బాల్ వికెట్లను కొట్టే క్రమంలో జారింది. దీంతో అతని చేయి వికెట్లను తగిలింది. కానీ అదే సమయంలో బాల్ వికెట్లకు దూరంగా వెళ్ళింది. చాలా సేపు పరిశీలించిన తర్వాత థర్డ్ అంపైర్ బాల్ వికెట్లను తగిలినట్టు స్పష్టం చేసి గిల్ ను ఔట్ గా ప్రకటించారు. దీంతో 76 పరుగుల వద్ద గిల్ నిరాశగా పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. డగౌట్ కు వెళ్లిన తర్వాత గిల్ చాలా కోపంతో తన రనౌట్ గురించి థర్డ్ అంపైర్ తో చర్చించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

►ALSO READ | GT vs SRH: చెలరేగిన గిల్, బట్లర్ మెరుపులు.. చావో రేవో మ్యాచ్‌లో సన్ రైజర్స్‌కు అగ్ని పరీక్ష

చివరి రెండు మ్యాచ్ ల్లో గిల్ సెంచరీ దగ్గరకు వచ్చి మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్ కతా, రాజస్థాన్ పై సెంచరీ దగ్గరకు వచ్చి ఔటయ్యాడు. అయితే ఈ రోజు సొంతగడ్డపై ఎలాగైనా సెంచరీ కొట్టాలని భావించిన గిల్ కు రనౌట్ రూపంలో దురదృష్టం నిరాశకు గురి చేసింది. ఓవరాల్ గా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసి గిల్ ఔటయ్యాడు. గిల్ తో పాటు జోస్ బట్లర్ (37 బంతుల్లో 64: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ మూడు వికెట్లు తీసుకోగా.. అన్సారీ, కమ్మిన్స్ తలో వికెట్ తీసుకున్నారు.