GT vs SRH: చెలరేగిన గిల్, బట్లర్ మెరుపులు.. చావో రేవో మ్యాచ్‌లో సన్ రైజర్స్‌కు అగ్ని పరీక్ష

GT vs SRH: చెలరేగిన గిల్, బట్లర్ మెరుపులు.. చావో రేవో మ్యాచ్‌లో సన్ రైజర్స్‌కు అగ్ని పరీక్ష

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ బౌలర్లు విఫలమయ్యారు. గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టిన మన బౌలర్లు శుక్రవారం (మే 2) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా నిరాశపరిచారు. అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతంగా ఆడిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ ( 38 బంతుల్లో 76: 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ మూడు వికెట్లు తీసుకోగా.. అన్సారీ, కమ్మిన్స్ తలో వికెట్ తీసుకున్నారు.  

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ తొలి ఓవర్ నుంచే బౌండరీలతో విరుచుకుపడ్డారు. మూడో ఓవర్లో సాయి సుదర్శన్ ఏకంగా 5 ఫోర్లు కొడితే.. నాలుగో ఓవర్లో గిల్ 17 పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే లో వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించడంతో తొలి 6 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే తర్వాత సాయి సుదర్శన్ (48) అన్సారీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 

►ALSO READ | హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మే 5న సిటీలో ఆ రోడ్లు బంద్

ఈ దశలో గిల్ కు జత కలిసిన బట్లర్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ సింగిల్స్ తీస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో గిల్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత వరుస బౌండరీలతో స్టేడియాన్ని గిల్ హోరెత్తించాడు. అయితే 13 ఓవర్లో వివాదాస్పద రనౌట్ కారణంగా గిల్ 76 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. గిల్ ఔటైనా బట్లర్ చెలరేగి రాజస్థాన్ ను 200 పరుగుల మార్క్ దాటించాడు.31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బట్లర్ 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు.