GT vs SRH: అత్యద్భుతం జరిగితేనే ప్లే ఆఫ్స్ ఛాన్స్: సరిపోని అభిషేక్ పోరాటం.. గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ ఓటమి

GT vs SRH: అత్యద్భుతం జరిగితేనే ప్లే ఆఫ్స్ ఛాన్స్: సరిపోని అభిషేక్ పోరాటం.. గుజరాత్ చేతిలో సన్ రైజర్స్ ఓటమి

ఐపీఎల్ 2025 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ దారులు పూర్తిగా మూసుకుపోయాయి. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో శుక్రవారం (మే 2) గుజరాత్ టైటాన్స్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అధికారికంగా నిష్క్రమించిపోయినా.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే అత్యద్భుతం జరగాల్సిందే. మొదట బౌలర్లు దారుణంగా విఫలం కాగా ఛేజింగ్ లో అభిషేక్ శర్మ (74) పోరాటం జట్టు విజయానికి సరిపోలేదు.

అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో గుజరాత్ సొంతగడ్డపై అద్భుతంగా ఆడి ఏడో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ విజయంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరువైంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమైంది.   

225 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ కు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 49 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 20 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రషీద్ ఖాన్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు హెడ్ ఔటయ్యాడు. అభిషేక్ శర్మ మెరుపులతో సన్ రైజర్స్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (13) ఔటయ్యాడు. ఈ దశలో క్లాసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. 

►ALSO READ | GT vs SRH: మరోసారి సహనం కోల్పోయిన గిల్.. ఈ సారి గ్రౌండ్‌లో అంపైర్‌తో వాగ్వాదం..అభిషేక్ శర్మ కూల్ చేశాడు

భారీ షాట్లు కొడుతూ మ్యాచ్ పై ఆశలు కలిపించారు. అప్పటివరకు జోరు మీదున్న అభిషేక్ శర్మ 14 ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఔట్ కావడంతో సన్ రైజర్స్ ఛేజింగ్ లో వెనకపడింది. కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఒత్తిడిలో క్లాసన్ (23) వికెట్ కోల్పోయాడు. వెంటనే అనికేత్ వర్మ (2), కామిందు మెండీస్ (0)పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్ జట్టు పరాజయం ఖాయమైంది. చివర్లో నితీష్ రెడ్డి(21), కమ్మిన్స్(19) భారీ హిట్టింగ్ చేసినా అవి సన్ రైజర్స్ విజయానికి ఏ మాత్రం సరిపోలేదు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ శర్మ, కొయెట్జికి చెరో వికెట్ లభించింది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ శుభమాన్ గిల్ ( 38 బంతుల్లో 76: 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (37 బంతుల్లో 64: 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఉనాద్కట్ మూడు వికెట్లు తీసుకోగా.. అన్సారీ, కమ్మిన్స్ తలో వికెట్ తీసుకున్నారు.