
హైదరాబాద్: జన గణనతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన సర్వేకి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కుల గణనను మోడల్‌గా తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవడం గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపడతామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం (మే 2) అత్యవసర భేటీ అయ్యింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సీడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో కుల గణనపై సీడబ్ల్యూసీ చర్చింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ వల్లే కేంద్ర కుల గణన చేపట్టాలని నిర్ణయించిందని.. ఇందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఖర్గే. మనం నిజాయితీతో ప్రజా సమస్యలను లేవనెత్తితే ప్రభుత్వం తలవంచాల్సిందేనని రాహుల్ గాంధీ మరోసారి నిరూపించారని అన్నారు. ఇదిలా ఉంటే.. సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కుల గణనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆయన వెల్లడించారు.
►ALSO READ | సంస్థా ‘గతమేనా’.. రాష్ట్రంలోని మూడు పార్టీల్లో అదే పరిస్థితి
‘‘జన గణనలో కుల గణనకు తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి ఐన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. నాలుగు గోడల మధ్య నలుగురి ఆలోచనలతో కాకుండా మొత్తం పౌర సమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కుల సంఘ నాయకులు, విద్యావేత్తల నుండి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిన విషయాన్ని CWC తన తీర్మానంలో ప్రస్తావించింది.
ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొక్కసారి నా అభినందనలు’’ అని పేర్కొన్నారు సీఎం రేవంత్.