
= మూడు పార్టీల్లో అదే పరిస్థితి
= మండల, జిల్లా, రాష్ట్ర కార్యవర్గాల్లేవ్
= స్థానిక సంస్థలపై ఎన్నికలపై కొనసాగుతున్న సైలెన్స్
= నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
= పీసీసీకి చీఫ్ మాత్రమే కార్యవర్గమే లేదు
= బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఇంకా జరగనే లేదు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి 17 నెలలు కావస్తున్నా.. పార్టీలు సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. త్వరలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పురపాలక సంఘాలు, సహకార ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు సంస్థాగత నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దిశగా కనీసం ఏర్పాట్లు జరగడం లేదని ఆయా పార్టీల కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు అంటున్నారు.
బీఆర్ఎస్ కార్యవర్గానికి ఎనిమిదేండ్లు
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ఇప్పటి వరకు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించలేదు. 2017లో పార్టీ అధిష్టానం అప్పటి టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతున్నది. పార్టీ బీఆర్ఎస్‌గా మారినప్పటికీ కొత్త కార్యవర్గాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ నో చేంజ్. చివరిసారిగా బీఆర్ఎస్ పార్టీ 2021 సెప్టెంబర్ 2న సంస్థాగత కమిటీలు వేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకూ 15 మంది సభ్యులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
గ్రామాల్లోని విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక తదితర పార్టీకి అనుబంధాలైన 14 సంఘాలను నియమించింది. అదేనెల 13 నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయిలో కమిటీలను వేసింది. 2022 జనవరి 26న పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. పాత కమిటీలన్నీ రద్దయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్యవర్గాలను, అనుబంధ కమిటీలను నియమించలేదు. 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పదవుల్లో ఉన్న చాలా మంది పార్టీ మారారు. వారి స్థానంలో కొత్తవారి నియామకం జరగలేదు.
20లోగా డీసీసీలు.. తర్వాతే మండలాలకు..
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర కార్యవర్గం లేకపోవడం గమనార్హం. పీసీసీ చీఫ్‌గా ఇటీవలే బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఏఐసీసీలోనూ చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీ ప్రాతిపదికన నియమకాలు జరిగే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు అనుబంధ సంఘాల నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో డీసీసీ అధ్యక్షుల నియామకం జరగాలి. పీసీసీకి రాష్ట్ర వ్యాప్తంగా 35 డీసీసీలు ఉన్నాయి.
ఈ 35 జిల్లాలకు పీసీసీ అబ్జార్వర్ల నియామకం పూర్తయింది. మే 20 లోగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తి కావాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ ఇటీవలే గాంధీ భవన్లో జరిగిన మీటింగ్‌లో క్లారిటీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవుల కోసం జిల్లాకు మూడు పేర్లతో ప్యానెల్ తయారు చేయాలని, ఆ మూడు పేర్లపై స్థానిక నాయకుల నుంచి అభిప్రాయసేకరణ జరిపి, ఎవరికి ఎక్కువ మొగ్గు కనిపిస్తే వారిని డీసీసీ అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ తర్వాత మండల, బ్లాక్, గ్రామ కమిటీలు, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ, ఇతర అనుబంధ సంఘాలకు బాధ్యలను నియమించే అవకాశం ఉంది.
కమలంలో వీడని సస్పెన్స్
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల చీఫ్‌ల నియామకం ఇప్పటికే పూర్తయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల నియామకం చేపట్టాల్సి ఉంది. తెలంగాణలో బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలున్నాయి. అందులో 36 జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయ్యాయి. కేవలం కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్‌లో ఉంది. ఈ నియామకాల్లోనూ అసంతృప్తి నెలకొంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దీనిపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. ఇదిలా ఉండగా మండలాల అధ్యక్షులు, కార్యదర్శుల నియాకం పూర్తయినా పూర్తి స్థాయి కార్యవర్గాలు ఏర్పాటు కాలేదు. గ్రామ కమిటీల ఏర్పాటు కూడా జరగలేదు.