బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. 11 గంటల తర్వాత పుంజుకుంది. 9 గంటల వరకు 13.13 శాతంగా ఉన్న పోలింగ్.. 11 గంటలకు 27.65 శాతానికి చేరుకుంది. బిగుసరై జిల్లాలో అత్యధికంగా 30.37 శాతం పోలింగ్ నమోదు కాగా, పాట్నాలో అత్యల్పంగా 23.7 శాతం ఓటింగ్ నమోదైంది.
బిగుసరై తర్వాత లఖసరై లోనూ 30 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మిగతా జిల్లాల్లో పోలింగ్ సరళి ఇలా ఉంది. గోపాల్‌గంజ్ 30.04%, బక్సర్ 28.02%, భోజ్‌పూర్ 26.76%, దర్భంగా 26.07%, ఖగారియా 28.96%, మాధేపురా 28.46%, ముంగేర్ 26.68%, ముజఫర్‌పూర్ 29.66%, నలందా 89,62% సమస్తిపూర్ 27.92%, సరన్ 28.52%, షేక్‌పురా 26.04%, సివాన్ 27.09%, వైశాలి 28.67% శాతంగా ఉంది.
తొలి దశ పోలింగ్ సందర్భంగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలోని భక్తియార్‌పూర్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత, ఆయన తన సిరా గుర్తు ఉన్న వేలును చూపించారు.
ఆర్జేడీ నాయకుడు, గ్రాండ్ అలయన్స్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "ఎక్స్"లో తాను, తన కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలను పోస్ట్ చేసి ఓటు వేయాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బిహార్ ప్రజలు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఓటు అమూల్యమైనదని, ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మొత్తంగా 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో 1,314 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 121 నియోజకవర్గాల్లోని 3.75 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. తొలిదశలో పోటీ పడుతున్న వారిలో ఆర్జేడీ అగ్రనేత, మహాఘట్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తో పాటు బీజేపీ సీనియర్ లీడర్, బిహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి తదితరులు ఉన్నారు. వైశాలి జిల్లాలోని రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తేజస్వీ యాదవ్ ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మరోమారు ఇక్కడి నుంచే పోటీచేస్తున్న తేజస్వీ.. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ బీజేపీ తరఫున సతీశ్ కుమార్ బరిలో ఉన్నారు.
2010లో ఇదే నియోజకవర్గంలో తేజస్వీ తల్లి రబ్రీదేవిని సతీశ్ ఓడించారు. కాగా, రాఘోపూర్ నుంచి తాను కూడా పోటీ చేస్తానని జన్ సురాజ్ అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. అయితే, తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న ప్రశాంత్ కిశోర్.. తన పార్టీ తరఫున చంచల్ సింగ్ ను నిలబెట్టారు. ప్రస్తుతం బరిలో ఉన్న తేజస్వీ, సతీశ్ కుమార్ల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
