ఏపీలో ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. ఈ క్రమంలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో కేవీబీ పురంలోని రాయలచెరువు కట్ట తెగడంతో పలు గ్రామాలూ నీట మునిగాయి. ఈ క్రమంలో కలత్తూరు, పాతపాలెం తదితర గ్రామాలను వరద ముంచెత్తింది. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ ఊళ్లకు ఊళ్ళు ఖాళీ చేస్తున్నారు.
భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రభావిత గ్రామాల ప్రజలు ఇళ్ళు వదిలేసి మండల కేంద్రానికి తరలి వెళ్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణనష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.
భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పట్లేదని.. ప్రభుత్వం ఈ పరిస్థితిని నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్థులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు గ్రామస్థులు.
