సీనియర్ కన్నడ యాక్టర్, KGF నటుడు హరీష్ రాయ్ (Harish Rai) కన్నుమూశారు. ‘కేజీఎఫ్ చాచా’గా పేరు తెచ్చుకున్న హరీష్ రాయ్.. గురువారం (2025 నవంబర్ 6న) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'ఓం' సినిమాతో హరీష్ రాయ్ గుర్తింపు పొందినప్పటికీ, 'కేజీఎఫ్' ద్వారా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
కేజీఎఫ్ చాచా ఎలా చనిపోయాడంటే: నటుడు హరీష్ రాయ్ కొన్ని నెలలుగా బెంగళూరులోని కిద్వాయ్ ఆసుపత్రిలో థైరాయిడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ఈ మహమ్మారి రోగం తన కడుపుకు వ్యాపించిందని.. ఇటీవల నటుడే స్వయంగా తెలిపారు. క్యాన్సర్ నాలుగో స్టేజీకి వచ్చిందని, ట్రీట్ మెంట్కి ఆర్ధిక సాయం చేయగలరని సోషల్ మీడియా వేదికగా కోరారు. చికిత్స ఖర్చు ఒక్కో ఇంజెక్షన్‌కు దాదాపు రూ.3.55 లక్షలు. మొత్తం రూ.70 లక్షలకు పైగా అవసరం ఉందని తెలిపారు.
ఆ వెంటనే కన్నడ యంగ్ హీరో ధృవ్ సర్జా, సినీ పరిశ్రమకు చెందిన ఆయన సహచరులు హెల్ప్ చేసి ఆదుకున్నారు. అయినప్పటికీ.. హరీష్ రాయ్ పరిస్థితి విషమించి ఇవాళ ఆయన కన్నుమూశారు. ఇది అతని అభిమానులను తీవ్ర బాధకు గురిచేస్తుంది. ఈ క్రమంలో కన్నడ సినీ పరిశ్రమతో పాటుగా చాచా అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
హరీష్ రాయ్ లైఫ్ ఒక పోరాట కథ.. బంగారు దుకాణ యజమాని నుండి కళాకారుడి వరకు ఎన్నో స్ట్రగుల్స్ పేస్ చేశాడు. అలా అందరు గుర్తించే నటుడి నుండి వ్యాధి వరకు, ప్రతి దశలోనూ పోరాటం చేస్తూ జీవించాడు. కానీ, విధి ఆడిన వింత నాటకాన్నీ(స్టేజ్ IV థైరాయిడ్ క్యాన్సర్) హరీష్ రాయ్ జయించలేకపోయాడు.
నటుడు హరీష్ రాయ్ సినిమాల విషయానికి వస్తే.. ఓం, తాయవ్వ, సమర, బెంగళూరు అండర్‌వరల్డ్, జోడిహక్కి, రాజ్ బహదూర్, సంజు వెడ్స్ గీత, స్వయంవర, మిందుం ఒరు కాదల్ కధై, మరియు KGF1, KGF2 లతో సహా కన్నడ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో నటించారు.
