కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే ఈ సమాజంలో న్యాయానికి రోజులు లేవేమో అనిపిస్తుంది. ఎక్కడి వారో, ఎవరో తెలియక పోయినా అద్దెకిచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది ఓ ఇంటి ఓనర్ . టీవీ చూస్తామని ఇంట్లోకి వచ్చి ఓనర్ ను చంపి మంగళసూత్రం ఎత్తుకెళ్లిన ఘటన బెంగళూరులో కలకలం రేపింది. సోమవారం (నవంబర్ 03) జరిగిన మర్డర్ కేసులో నిందితులను పట్టుకున్న పోలీసులు.. సంచలన విషయాలను వెల్లడించారు.
సోమవారం ఇంటిఓనర్ హత్య కేసును ఛేదించే క్రమంలో ఇంట్లో అద్దెకు ఉంటున్న జంటను విచారించారు పోలీసులు. విచారణ సందర్భంగా వారి మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో.. వాళ్ల స్టైల్ లో విచారించి నిజాన్ని కక్కించారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ శ్రీశైల్ (26), అతని భార్య సాక్షి హనమంత (23)ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
నిందితులైన భార్యభర్తలు ఇద్దరూ కాటన్ పేట్ లోని ఒక అగరుబత్తుల ఫ్యాక్టరీలో పనిచేసే అశ్వత్ నారాయణన్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. తమ ఓనర్ నారాయణ్ తో సహా ఆ ఏరియాలోని చాలా మందితో ఈ జంట అప్పు చేసినట్లు స్థానికులు చెప్పారు.
పోలీసుల వివరాల ప్రకారం.. అశ్వత్ నారాయణ్ ఇంట్లో లేని సమయంలో.. ఉత్తరహల్లిలోని ఇంట్లో అతని భార్య శ్రీలక్ష్మి (65) హత్యకు గురైంది. చంపేసి మంగళసూత్రను ఎత్తుకెళ్లారు నిందితులు. టీవీ చూస్తామని చెప్పి ఇంట్లోకి వచ్చిన నిందితులు.. ఆమెను దిండుతో మోది చంపేసి మెడలో ఉన్న తాళితో పరారయ్యారు.
నిందితులలో భర్త శ్రీశైల్ కూలీ పని చేసుకుంటుండగా.. భార్య సాక్షి పద్మనాభనగర్ జువెలరీ షాపులో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. అయితే వాళ్లు ఎందుకు అంత అప్పులు చేశారో తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు. మహిళను చంపిన తర్వాత డబ్బు కోసం ఇంట్లో ప్రతీ అంగుళం వెతికినట్లు తెలుస్తుందని అన్నారు. ఎక్కడా డబ్బు కనిపించకపోవడంతో మంగళసూత్రంతో పరారయ్యారని పోలీసులు చెప్పారు.
