అచ్చంపేట, వెలుగు: అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు సూచించారు. బుధవారం పట్టణంలోని శివసాయి నగర్ కాలనీలో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి, వాహనాల డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శివసాయి నగర్ కాలనీలో కొత్త ఇండ్లు కడుతున్నారని, కాలనీలో ఇటీవల దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. చోరీలను అరికట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు చెప్పారు.
ఇంటి యజమానులు సెంట్రల్ లాక్ సిస్టం ఉన్న తాళాలు వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. కాలనీలో కొత్త వ్యక్తులు కనిపిస్తే డయల్100కు, ఎస్సై, సీఐలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకు రావాలన్నారు. 60 బైక్లు, ఒక కారు, ఒక టాటా ఏస్, బొలెరోను స్వాధీనం చేసుకున్నామని, డాక్యుమెంట్లు సరిగా ఉన్న వాటిని తిరిగి ఇస్తామని డీఎస్పీ తెలిపారు. ఎస్సైలు సద్దాం హుసేన్, రాజేందర్, వెంకటేశ్ గౌడ్, వెంకట్ రెడ్డి, పవన్ కుమార్, సుధీర్, ఇందిరమ్మ పాల్గొన్నారు.
