
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పోరేషన్ కు ఏటా 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి సంస్థ సిద్ధమైంది. ఈ సరఫరాకు సంబంధించిన ఇంధన ఒప్పందాన్ని మరో 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ మేరకు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో తమిళనాడు పవర్ జనరేషన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.గోవిందరావు, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ మధ్య చర్చలు జరిగాయి. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా ఉడింగిడిలో ఉన్న 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు ఏటా 2.88 మిలియన్ టన్నుల జీ-11 గ్రేడ్ బొగ్గు అవసరమని గోవిందరావు తెలిపారు. సింగరేణి నుంచి బొగ్గును సరఫరా చేయాలని కోరారు.
దీనిపై బలరామ్ స్పందిస్తూ.. నైనీ బొగ్గు బ్లాక్ ద్వారా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని ఏర్పాట్లు చేయాలని నైనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒప్పందాన్ని 10 రోజుల్లో పూర్తి చేసేలా బొగ్గు రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. సింగరేణి, తమిళనాడు మధ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలోపేతం చేస్తుందని ఇరు సంస్థల సీఎండీలు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సింగరేణి ద్వారా తమిళనాడులోని నార్త్ చెన్నై విద్యుత్ ప్లాంట్‌కు ఏటా 1.75 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా అవుతున్నది. తాజా ఒప్పందంతో నైనీ ప్రాజెక్టు నుంచి మరో 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా జరగనుంది. నైనీ బొగ్గుకు మొదటి వినియోగదారుగా తమిళనాడు నిలవనుంది.