
హర్యానా రాష్ట్రం పానిపట్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో రెండవ తరగతి విద్యార్థిని తలక్రిందులుగా వేలాడదీసి కొట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయనందుకు శిక్షగా, టీచర్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌తో ఆ బాలుడి కాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీయించింది. అంతేకాదు వ్యాన్ డ్రైవర్ స్కూల్ విద్యార్థిని కొట్టాడు కూడా. ఇంకా స్కూల్ యాజమాన్యం ఈ విషయాన్ని 45 రోజుల పాటు దాచిపెట్టింది.
వివరాలు చూస్తే ఒక షాకింగ్ వీడియోలో 2వ తరగతి స్కూల్ విద్యార్థిని తాళ్లతో కట్టి, కిటికీకి తలక్రిందులుగా వేలాడదీసి దండించారు. ఆ పిల్లవాడి తల్లి మాట్లాడుతూ, తన ఏడేళ్ల కొడుకుని కొంతకాలం క్రితం స్కూల్లో చేర్పించామని, అయితే హోంవర్క్ చేయనందుకు ప్రిన్సిపాల్ రీనా స్కూల్ వ్యాన్ డ్రైవర్ అజయ్‌ని పిలిపించి బాలుడి తలకిందులుగా వేలాడదీసి కొట్టినట్లు ఆరోపించింది.
అజయ్ ఆ పిల్లవాడిని చెంపదెబ్బలు కొడుతూ, వీడియో కాల్స్ చేసి దుర్భాషలాడాడు అంతటితో ఆగకుండా ఆ వీడియో క్లిప్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి, చివరికి బాలుడి కుటుంబానికి చేరడంతో, బాలుడిపై వేధింపుల విషయం బయటపడింది.
►ALSO READ | పిల్లలు మారాం చేస్తున్నారని ఈ తల్లి చేసిన పని చేయకండి.. పాపం ఏడేళ్ల కొడుకు..
పిల్లల్ని చెంపదెబ్బ కొట్టిన ప్రిన్సిపాల్ : మరో వీడియోలో ప్రిన్సిపాల్ రీనా స్వయంగా తోటి విద్యార్థుల ముందు ఓ విద్యార్ధుడిని పదే పదే చెంపదెబ్బలు కొడుతూ కనిపించింది. ఆమె చేసిన ఈ పనిని సమర్థించుకుంటూ, పిల్లలు ఇద్దరు బాలికలతో అనుచితంగా ప్రవర్తించారని, వారిని క్రమశిక్షణలో పెట్టేందుకే ఇలా చేశానని, వారి తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇచ్చానని పేర్కొంది. అంతేకాదు హోమ్ వర్క్ చేయనందుకు శిక్షగా పిల్లలను టాయిలెట్లు శుభ్రం చేయమని టీచర్ బలవంతం చేస్తోందని ఆరోపించడంతో తల్లిదండ్రుల కోపం మరింత పెరిగింది.
దీనికి సంబంధించి పోలీసులు పలు ఐపీసీ సెక్షన్లు, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన తల్లిదండ్రులు & పిల్లల హక్కుల కార్యకర్తల నుండి స్కూల్ పిల్లల రక్షణ చట్టాలను మరింత బలోపేతం చేయాలని డిమాండ్లను రేకెత్తించింది.