తిరుమల ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డుపై మరో ప్రమాదం

తిరుమల ఘాట్ రోడ్డులో ఈ మద్య జరుగుతోన్న  ప్రమాదాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇవాళ ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో 17వ మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి రెయిలింగ్ ను ఢీ కొట్టింది .  ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జనుజ్జ అయ్యింది.  తీవ్రంగా గాయపడిన వారిని వాహనం నుంచి బయటకు తీశారు తోటి భక్తులు.  అయితే అంబులెన్స్ వచ్చే వరకు భక్తులు గాయాలతో రోడ్డుపైనే  నరకయాతన అనుభవించారు .  తర్వాత వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. 

ALSO READ :మా గ్రామాల్లో మీ సెల్ ఫోన్ ట‌వ‌ర్లు పెట్టొద్దు.. పీకిపారేస్తున్న జ‌నం
 
ఘాట్ రోడ్డులో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే  ప్రమాద ఘటనా స్థలానికి అంబులెన్స్ లు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది. 

వరుసగా పెరుగుతున్న ప్రమాదాలు.. జంకుతున్న భక్తులు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఘాట్ రోడ్డుపై వెళ్లక తప్పని పరిస్థితి. రోజు వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటారు.  అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత రెండు మూడు నెలల్లోనే  ఘాట్ రోడ్లలో ఐదారు ప్రమాదాలు జరగ్గా పదుల సంఖ్యల్లో గాయాలయ్యాయి.   వరుస  ప్రమాదాలతో తిరుమల భక్తులు కలవరపడుతున్నారు. ప్రమాదాలు జరగడానికి కారణమేంటో గుర్తించి   టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.