
హైదరాబాద్, వెలుగు: పేదలకు గృహ వసతి కల్పించడంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటి నిర్మాణానికి 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల సాయం అందిస్తున్నామని తెలిపారు. సోమవారం సెక్రటేరియెట్లో హౌసింగ్ అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఇందులో లక్షా 23 వేల ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, సీఎం ఆదేశాలతో ఒక్కో ఇంటికి 40 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, తదితర పట్టణాలలో కూడా ఇదే విధానాన్ని అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులును ఆదేశించారు.