మంజీర నీళ్లన్నీ గోదావరి పాలు!.. సింగూరు దిగువన ప్రాజెక్టులు లేక ఒడిసిపట్టలేని పరిస్థితి

మంజీర నీళ్లన్నీ గోదావరి పాలు!.. సింగూరు దిగువన ప్రాజెక్టులు లేక ఒడిసిపట్టలేని పరిస్థితి
  • సింగూరు దిగువన ప్రాజెక్టులు లేక ఒడిసిపట్టలేని పరిస్థితి
  • 25 ఏళ్లలో 350 టీఎంసీలు దిగువకు విడుదల

మెదక్, వెలుగు: జిల్లాలో సాగు నీటి నిల్వకు సరైన ప్రాజెక్టులు లేక విలువైన నీరు గోదారిలోకి వెళ్తోంది. చిలప్​ చెడ్ మండలం గంగారం దగ్గర నుంచి హవేలీ ఘనపూర్​ మండలం సర్ధన వరకు మంజీరా నది 50 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. మార్గమధ్యలో కొల్చారం మండలం చిన్న ఘనపూర్​ వద్ద ఉన్న ఘనపూర్​ ఆనకట్ట మినహా ఎక్కడా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేదు. ఈ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా నది మీద నిర్మించిన సింగూర్​ ప్రాజెక్ట్​ నీటి నిల్వ సామర్థ్యం 29 టీఎంసీలు కాగా ఎగువన కర్నాటక నుంచి భారీ వరద వచ్చి ప్రాజెక్ట్ పూర్తిగా నిండినప్పుడల్లా గేట్లు ఎత్తి పెద్ద మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

సింగూర్​ దిగువన ఎక్కడా నీటిని రిజర్వు చేసుకునే చాన్స్​లేకపోవడంతో మంజీరా నదిలో ప్రవహించే లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ఘనపూర్​ ఆనకట్ట మీద నుంచి కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు అక్కడి నుంచి గోదావరి నదిలోకి వెళ్తున్నాయి. 

అనేక ఏళ్లుగా..

2001నుంచి గడిచిన 25 ఏళ్లలో  దాదాపు 350 టీఎంసీల పైగా గా నీరు వృథాగా పోయింది. ఎగువన కర్నాటక నుంచి భారీ వరద వస్తుండడంతో గత 33 రోజులుగా సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ ప్రాజెక్ట్​ ఐదు గేట్లు ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొదట్లో 2, ఆతర్వాత 5,  7 గేట్లు ఎత్తి ఒక్కో రోజు75 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇలా గడిచిన 33 రోజుల్లో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 100 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. 

ఆ నీరంతా మెదక్ జిల్లా మీదుగా ప్రవహించి ఘనపూర్​ ఆనకట్ట మీదుగా గోదారిలో కలిసింది. ​ఇదివరకు ఎగువ నుంచి వరద వచ్చినా, మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా సింగూర్​ ప్రాజెక్ట్​ పూర్తి స్థాయిలో నిండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రాజెక్ట్​కు ప్రమాదం పొంచి ఉందన్న నేషనల్​డ్యామ్​ సేఫ్టీ అథారిటీ సూచనల నేపథ్యంలో సింగూర్​ ప్రాజెక్ట్​లో 17 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంచుతున్నారు. అంతకు మించి ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని గేట్లు ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు.

నిల్వకు అవకాశాలు లేక..

సింగూర్​ ప్రాజెక్ట్​ దిగువన మెదక్ జిల్లాలో కొల్చారం మండల పరిధిలోని ఘనపూర్​ ఆనకట్ట ఒక్కటి మాత్రమే ఉంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 0.2 టీఎంసీలు మాత్రమే. ఆనకట్టలో పూడిక పేరుకు పోవడం వల్ల నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్​ప్రభుత్వ హయాంలో ఘనపూర్​ఆనకట్ట ఎత్తును 1.7 మీటర్ల మేర పెంచేందుకు 2015లో రూ.43.64 కోట్లు మంజూరయ్యాయి. అదే ఏడాది మేలో శంకుస్థాపనచేసి పనులు షురూ చేశారు. పదేళ్లయినా ముంపునకు గురయ్యే భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపు  ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పెండింగ్​లో పడిపోయాయి. 

ఈ పనులు పూర్తయితే ఘనపూర్​ ఆనకట్ట నీటి నిల్వ సామర్థం 0.3 టీఎంసీలకు పెరిగేది.  తద్వారా ఆనకట్ట పరిధిలోని కొల్చారం, మెదక్, పాపన్నపేట, హవేలీ ఘనపూర్​ మండలాల పరిధిలో 30 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగు నీరందించేందుకు అవకాశం ఉంటుంది. 

నీటి నిల్వపై దృష్టి పెట్టాలి..

విలువైన సాగునీరు వృథాగా పోతుండడంతో నీటి నిల్వపై దృష్టి పెట్టాలని సాగునీటి రంగ నిపుణులు, రైతులు కోరుతున్నారు. మంజీరా నది మీద చిన్న రిజర్వాయర్లు, వీలైనన్ని చెక్​ డ్యాంలను నిర్మించాలని కోరుతున్నారు. తద్వారా వృథాగా  పోయే నీటిని కొంత మేర అయినా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని, భూగర్భ జలాలు పెరగడంతో పాటు పంటల సాగు విస్తీర్ణం సైతం పెరుగుతుందని చెబుతున్నారు.