
- మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ,హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్స్క్, జిల్లా రెవెన్యూ , విద్యుత్,హెల్త్ వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే మూడు రోజుల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత జాగ్రత్తగా పనిచేయాలన్నారు.
లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే స్పందించాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వాహనదారులు జాగ్రత్తగా వెళ్లేలా ఫీల్డ్‌లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ స్తంభాల, తీగల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఆగని వరుణుడి ప్రతాపం
సిటీపై వరుణుడి ప్రతాపం ఆగట్లేదు. ఇప్పటికే కురిసిన వర్షం నుంచి కొలులోకముందే శుక్రవారం రాత్రి మళ్లీ వర్షం దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, కాలనీల్లోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. రాత్రి 11 గంటలకు వరకు బండ్లగూడలో అత్యధికంగా 9.33 సెంటీమీటర్ల వాన కురిసింది.
సరూర్ నగర్లో 6.68, నాంపల్లిలో 6.50, హయత్ నగర్లో 6.13, వనస్థలిపురంలో 6.00, రామంతపూర్‌లో 3.28, అంబర్ పేటలో 2.05 సెం.మీ వర్షపాత నమోదైంది. వర్షం కారణంగా అత్యవరమైతే హైడ్రా లేదా జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్లు, 9000113667, 040-21111111 సంప్రదించాలని అధికారులు సూచించారు.