
- నెలలోపు దూడలపై తీవ్ర ఎఫెక్ట్
- ఇప్పటికే గద్వాల జిల్లాలో 100 పైగా దూడలు మృతి
- ఆందోళన చెందుతున్న రైతులు
- వ్యాక్సిన్ వేస్తే ఇబ్బంది ఉండదు అంటున్న వెటర్నరీ డాక్టర్లు
గద్వాల, వెలుగు : పశువుల్లో లంపి స్కిన్ (ముద్ద చర్మ వ్యాధి) డిసీజ్ మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా నెలలోపు దూడలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో వందకు పైగా లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. అదేవిధంగా పెద్ద పశువులు, ఆవులు లంపి స్కిన్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ డిసీజ్ తో అల్లాడిపోయిన పశువులు.. మళ్లీ ఈ వ్యాధి తిరగబడుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశువుల శరీరమంతా కురుపులు..
లంపి స్కిన్ డిసీజ్ వచ్చిన పశువులకు శరీరమంతా కురుపులు (బోడిసెలు) వస్తాయి. ఈ వ్యాధి సోకిన పశువులకు 103 నుంచి 108 డిగ్రీల సెల్సియస్ జ్వరం వస్తుంది. ముక్కు, కండ్ల నుంచి నీళ్లు కారుతాయి. కురుపులు పగిలి రక్తం కూడా వస్తుంది. మేత సరిగా మేయకపోవడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే లంపి స్కిన్ డిసీజ్ వచ్చినట్లు గుర్తించాలి.
ఏడాదిలోపు దూడలపై తీవ్ర ఎఫెక్ట్..
ఏడాదిలోపు దూడలపై లంపి స్కిన్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈసారి వచ్చిన లంపి స్కిన్ డిసీజ్‌తో లేగ దూడలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ధరూర్ మండలంలో 15, గట్టు మండలంలో 20 పశువుల వరకు ఈ వ్యాధి సోకినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. గద్వాల జిల్లాలో లంపి స్కిన్ డిసీజ్‌తో ఇప్పటివరకు వందకు పైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. గట్టు మండలంలోని రాయపురం, మల్లాపురం ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. గ్రామాల్లో లేగ దూడలతోపాటు పశువులు, ఆవులు, ఎద్దుల్లో ఈ డిసీజ్ తీవ్రత
ఎక్కువగా ఉంది.
ముందస్తుగానే టీకాలు వేసుకోవాలి..
ఎద్దులు, ఆవులు, లేగ దూడలు ఉన్నవారు లంపి స్కిన్ డిసీజ్ రాకముందే పశువులకు టీకాలు వేయించాలని వెటర్నరీ వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి నిర్మూలనకు ఇప్పటివరకు ఎలాంటి మందు అందుబాటులో లేవు. అయినప్పటికీ వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున ముందస్తుగానే ‘గోట్ ఫ్యాక్స్’ వ్యాక్సిన్ వేయడంతో వ్యాధిని అరికడుతుంది. ఇమ్యూనిటీ పవర్ లేని పశువులు మాత్రమే అక్కడక్కడ మృత్యువాత పడుతున్నాయి. ఏడాదిలోపు లేక దూడలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ ఉంటుంది.
లంపి స్కిన్.. అంటువ్యాధి..
పశువులకు సోకిన లంపి స్కిన్ అంటు వ్యాధి. దోమలు, ఈగల ద్వారా వేగంగా పశువుల్లో ఈ వ్యాధి విస్తరిస్తున్నది. ఇది అంటువ్యాధి కావడంతో ఒక పశువుకి ఒక గ్రామంలో సోకితే వారం రోజుల్లోనే గ్రామంలోని అన్ని పశువులకు సోకే అవకాశం ఉంటుంది. అందువల్ల రోగం రాని పశువులకు ముందుగానే టీకాలు వేయించి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నాం..
లంపి స్కిన్ డిసీజ్ వ్యాధి మళ్లీ తిరగబడుతున్నది. పశువులకు వ్యాధి సోకకుండా ముందుస్తుగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేసి పశువులకు టీకాలు వేస్తున్నాం. ఈ వ్యాధి వల్ల ఒక శాతం మాత్రమే పశువులు చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ డిసీజ్ వచ్చిన పశువులకు మూడు రోజులు యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుందన్నారు. వెంకటేశ్వర్లు, జిల్లా వెటర్నరీ ఆఫీసర్, గద్వాల