
- భార్య కూడా దూకడంతో రక్షించిన పోలీసులు
- యాదాద్రి జిల్లాలో ఘటన
యాదాద్రి, వెలుగు: చెరువులో దూకి బ్యాంకు మేనేజర్ గల్లంతైన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్జిల్లా ఐనవోలుకు చెందిన బర్ల సురేందర్(36) , సంధ్యారాణి దంపతులు కొడుకు చోటుతో కలిసి హైదరాబాద్ రామాంతాపూర్‌లో ఉంటున్నాడు. సురేందర్ హైటెక్‌సిటీలోని ఓ ప్రైవేట్బ్యాంక్లో మేనేజర్. శుక్రవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు.
యాదాద్రి జిల్లా బీబీనగర్ చెరువు వద్దకు వెళ్లి.. తన ఫోన్లో వాయిస్ మెసేజ్రికార్డు చేసి భార్యకు, బంధువులకు పంపించాడు. ‘నాకు పది రోజులుగా మానసిక స్థితి బాగా లేదు. చావు రమ్మని పిలుస్తోంది. అందుకే బీబీనగర్చెరువులో దూకి చనిపోతున్నా. నా అంత్యక్రియలు పాత ఇంటి వద్ద చేయాలి”. అంటూ వాయిస్ మెసేజ్‌లో తెలిపాడు.
అనంతరం సురేందర్చెప్పులు, ఫోన్ కట్టపైన లభించాయి. వెంటనే సంధ్యారాణి, బంధువులతో కలిసి బీబీనగర్ వెళ్లారు. అప్పటికే పోలీసులు చెరువు వద్దకు వెళ్లగా సురేందర్ సెల్‌ఫోన్, చెప్పులు కన్పించాయి. దీంతో చెరువులో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్సిబ్బందితో గాలింపు చేపట్టారు.
అక్కడికి చేరిన సంధ్యారాణి భర్త లేకుండా తాను బతకలేనని చెరువులో దూకింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను రక్షించారు. తల్లిని హత్తుకుని కొడుకు బోరున విలపించాడు. కాగా.. చెరువు నిండా నీళ్లు ఉండగా చీకటిపడే వరకూ వెతికినా సురేందర్ఆచూకీ దొరకలేదు. దీంతో రాత్రి గాలింపు నిలిపివేశారు. శనివారం మళ్లీ గాలింపు కొనసాగిస్తామని ఎస్ హెచ్‌వో ప్రభాకర్ రెడ్డి తెలిపారు.