
- ప్రస్తుతం పెద్దపల్లి నుంచి వరంగల్ వరకు నిర్మాణంలో రెండు స్టేట్ హైవేలు
- వీటిని జాతీయ రహదారులుగా గుర్తించాలని ప్రపోజల్స్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రపోజల్స్‌ను పట్టించుకోని కేంద్రం
పెద్దపల్లి, వెలుగు: నేషనల్ హైవేల్లో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ప్రాధాన్యం దక్కడం లేదు. పెద్దపల్లి జిల్లాలో మంచిర్యాల– వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణంలో ఉంది. ఈ హైవేను పెద్దపల్లి జిల్లాకేంద్రంతో కనెక్ట్ చేసే రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పంపినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రస్తుతం జిల్లా కేంద్రం మీదుగా వెళ్తున్న రాజీవ్ రహదారిని నేషనల్ హైవేగా గుర్తించాలన్న అంశంపై కేంద్రం సైలెంట్‌గానే ఉంటోంది. దీంతో పెద్దపల్లి జిల్లాకేంద్రానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా పోతోంది.
ప్రస్తుతం జిల్లా మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైవేతోపాటు పెద్దపల్లి నుంచి ముత్తారం మీదుగా భూపాలపల్లి, వరంగల్ వరకు, కాల్వశ్రీరాంపూర్ మీదుగా జమ్మికుంట, హుజూరాబాద్ మీదుగా వరంగల్ రామప్ప వరకు స్టేట్ హైవేలు నిర్మాణంలో ఉన్నాయి.. వీటిని కూడా నేషనల్ హైవేలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపినా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.
ప్రపోజల్స్‌ను పట్టించుకోవట్లే..
జిల్లా కేంద్రమయ్యాక పెద్దపల్లికి రాకపోకలు పెరిగాయి. కాగా పెద్దపల్లి టౌన్‌ను నేషనల్‌హైవేతో అనుసంధానించడం ప్రపోజల్స్‌కే పరిమితమైంది. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోనే మొట్టమొదటగా స్టేట్ హైవేగా రాజీవ్ రహదారిని నిర్మించారు. దీనిని నేషనల్ హైవేగా గుర్తించాలని 2004లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాటు కరీంనగర్‌నుంచి రాయపట్నం రోడ్డును కూడా స్టేట్‌హైవేగా అభివృద్ది చేశారు.
పెద్దపల్లి నుంచి మంథని మార్గంలో ట్రాఫిక్ పెరిగిపోడంతో ఈ రోడ్డును విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రపోజల్స్పంపినా కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ రోడ్డు ప్రస్తుతం జగిత్యాల నుంచి పెద్దపల్లి మీదుగా కాటారం వరకే విస్తరించేలా ప్రతిపాదనల్లో సూచించారు. అయితే ఇదే రోడ్డు కాటారం నుంచి చత్తీస్‌గఢ్ వరకు పోతుందనే విషయాన్ని ప్రపోజల్స్‌లో పెట్టకపోవడంతో జాతీయహోదా దక్కలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాకేంద్రం నుంచి -ముత్తారం-– తాడిచర్ల- మీదుగా భూపాలపల్లి-, వరంగల్ వరకు, పెద్దపల్లి- నుంచి కాల్వశ్రీరాంపూర్-, జమ్మికుంట-, హుజూరాబాద్- మీదుగా వరంగల్-, రామప్ప వరకు రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ రెండు రోడ్లు పెద్దపల్లి జిల్లాకు అతి ముఖ్యమైనవి కాగా ఇవి రాష్ట్ర రహదారులుగానే నిర్మితమవుతున్నాయి. వీటిని జాతీయ రహదారులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
రోడ్లన్నీ గుంతలమయం
పెద్దపల్లి జిల్లాలో దశాబ్దం కింద వేసిన రోడ్లన్నీ గుంతలమయమయ్యాయి. పెద్దపల్లి నుంచి ధర్మారం మీదుగా జగిత్యాలకు వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. పెద్దపల్లి నుంచి మంథని మార్గం పూర్తిగా దెబ్బతింది. అయిదేళ్ల కింద నుంచి రిపేర్లు చేసినా ఫలితం శూన్యం. పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ మీదుగా వరంగల్ వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారిపోయింది. ఈ మార్గాల్లో టర్నింగ్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.