కేరళలో ‘జికా’ కలకలం.. 44కు చేరిన కేసులు

కేరళలో ‘జికా’ కలకలం.. 44కు చేరిన కేసులు

తిరువనంతపురం: ఓ వైపు అదుపులోకి రాని కరోనా కేసులతో సతమతం అవుతున్న కేరళ రాష్ట్రంలో జికా వైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అదుపులోకి వస్తుంటే.. ఇక్కడ మాత్రం రోజు రోజుకూ పెరుగుతుండడం చికాకుపెడుతోంది. గురువారం నాడు ఏకంగా 12 వేల కేసులు కేరళలో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మరణాలు కూడా 122 నమోదయ్యాయి. కరోనా మొదటి వేవ్ లో దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన కేరళ.. సెకండ్ వేవ్ చివర్లో దేశంలోనే ఎక్కువ కేసులతో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పులిమీద పుట్రలా అక్కడక్కడా కొత్త జికా వైరస్ కేసులు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో గురువారం మరో మూడు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. తిరువనంతపురంకు చెందిన ఇద్దరు 25 నుంచి 37ఏళ్ల వ్యక్తులు, మరో బాలుడికి జికా వైరస్ నిర్ధారణ అయింది. తిరువనంతపురంలోని మెడికల్ వైరాలజీ ల్యాబ్ లోనే ఈ కేసుల నిర్ధారణ జరిగిందని, ఈ మూడు కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో జికా వైరస్ కేసుల సంఖ్య 44కి చేరిందని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 
జికా వైరస్ విషయంలో హై అలర్ట్ ప్రకటించి కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని.. జికా వైరస్ గురించి ఎలాంటి భయం అవసరం లేదని.. అందరూ డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోతున్నారన్న ప్రభుత్వ ప్రకటన నేపధ్యంలో చాలా మంది జికా వైరస్ ను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు జికా వైరస్ సోకిన వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.