- వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు
అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు, అశ్వారావుపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించి అశ్వారావుపేట బార్డర్ చెక్ పోస్ట్ వద్ద 300 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని జిలుగుమిల్లి వైపు నుంచి అశ్వారావుపేట వైపు లారీని తనిఖీ చేయగా, రాజస్థాన్ కు చెందిన లారీ క్యాబిన్ వెనుక భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన సీక్రెట్ ఛాంబర్ లో 10 కిలోల బరువు ఉన్న 30 గంజాయి ప్యాకెట్లు దాచినట్లు గుర్తించారు.
వీటి విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని ఎస్పీ చెప్పారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజేశ్ పూరి, షాహజాబ్ ఖాన్, కమలేశ్ శర్మ, రమేశ్ చంద్రబలైను అరెస్ట్ చేశామని తెలిపారు. లారీతో పాటు ఎస్కార్ట్ కు ఉపయోగించిన కారు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ముంచింగిపట్టు గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రెండేళ్లలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.77 కోట్ల విలువైన 15,293 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని 670 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. డీఎస్పీ సతీశ్ కుమార్, సీఐ నాగరాజు, ఎస్సైలు యయాతి రాజు, రాజేశ్ కుమార్ పాల్గొన్నారు.
