3 వేల కోట్ల భూమి కొట్టేసిన్రు.. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన అధికారులు

3 వేల కోట్ల భూమి కొట్టేసిన్రు.. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తికి కట్టబెట్టిన అధికారులు
  • గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కదిలిన ఫైళ్లు
  •     2005లో హైదరాబాద్​లోని కొండాపూర్​లో సత్యసాయిబాబా ట్రస్టుకు 42 ఎకరాలు రెగ్యులరైజ్
  •     ట్రస్టు నుంచి భూపతి అసోసియేట్స్​కు, అటు నుంచి నూజివీడు సీడ్స్ 
  • ప్రభాకర్ రావు చేతికి భూమి
  •     ఎండోమెంట్, యూఎల్ సీ చట్టాలను తుంగలోతొక్కి రెగ్యులరైజేషన్ 
  •     గత జీవోలను సవరిస్తూ ఎన్నికల ఏడాదిలో అక్రమంగా కొత్త జీవోలు
  •     ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్న ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​లో మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో ప్రభుత్వానికి చెందాల్సిన భూమిని కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన తమ పేరు మీద రాయించుకున్నారు. ఈ వ్యవహారానికి కొందరు అధికారులు సహకరించారు. దీంతో ప్రభుత్వానికి చెందాల్సిన 42 ఎకరాల భూమి.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయింది. కొండాపూర్​లో ఉన్న ఈ భూమి విలువ రూ.3 వేల కోట్లపైనే ఉంటుంది. అక్రమార్కులకు భూమిని కట్టబెట్టేందుకు అధికారులు ఎండోమెంట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్ సీ) చట్టాలను తుంగలోతొక్కారు. అంతకుముందు  ఇచ్చిన జీవోలను సవరించి, కొత్త జీవోలు ఇచ్చారు.

ఎన్నికల ఏడాదిలో జరిగిన ఈ తతంగంపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. సర్కార్ కు చెందాల్సిన భూమిని ఇతరుల పేరు మీదకు ఎలా మళ్లించారనే దానిపై ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఈ ఫైళ్లు కదిలినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

ఇదీ భూమి కథ.. 

హైదరాబాద్​ కొండాపూర్​లోని 104/1, 104/2, 105,106,107,108 సర్వే నంబర్లలోని 85.32 ఎకరాల భూమికి వేగే వీరయ్య, వేగే నాగభూషణం, వేగే భాస్కరరావు యజమానులు. వీరంతా వేగే సీతరామయ్య వారసులు. వీళ్లు ఈ మొత్తం భూమిని మాదాల తిమ్మయ్యకు జీపీఏ ద్వారా 1998లో భగవాన్​శ్రీ సత్యసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు విక్రయించారు. అదే భూమిని ట్రస్టు వాళ్లు 2000 సంవత్సరంలో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏతో ఆరు రిజిస్టర్డ్​డాక్యుమెంట్స్​ద్వారా మెసర్స్​భూపతి అసోసియేట్స్​కు అమ్మారు. 2002లో భూపతి అసోసియేట్స్, సాయిబాబా ట్రస్ట్​సంయుక్తగా నూజివీడు సీడ్స్ కంపెనీకి చెందిన వ్యక్తితో సేల్ అగ్రిమెంట్ చేసుకుని ఎంఓయూ రాసుకున్నాయి. అయితే ఈ వ్యవహారమంతా అర్బన్ ​ల్యాండ్ ​సీలింగ్​ విభాగం అనుమతి లేకుండానే జరిగింది. యూఎల్ సీ యాక్ట్​ ప్రకారం.. ఆ విభాగం అనుమతి లేకుండా జరిపే భూముల అమ్మకాలు చెల్లవు. దీంతో 2005లో యూఎల్​సీ స్పెషల్​ఆఫీసర్ దీనిపై ఎంక్వైరీ చేసి ఆ డాక్యుమెంట్లను రద్దు చేశారు. చట్ట ప్రకారం రిటైనబుల్ ల్యాండ్​కింద భూముల హక్కుదారులకు ఒక్కొక్కరికి 5.10 ఎకరాల చొప్పున ముగ్గురికి 15.30 ఎకరాలు ఇచ్చి, మిగిలిన 70 ఎకరాలు మిగులు భూమిగా ప్రకటించారు. 

గైడ్ లైన్స్ ప్రకారం భూపతి అసోసియేట్స్.. మిగులు భూమి నుంచి భూకేటాయింపుల కోసం యూఎల్​సీకి దరఖాస్తు పెట్టుకుంటే 3వేల చదరపు మీటర్లు మాత్రమే వస్తుంది. మిగిలిన 69.10 ఎకరాలు ప్రభుత్వానికి వెళ్తుంది. అయితే ఎక్కువ భూమిని కొట్టేసేందుకు భూపతి అండ్ అసోసియేట్స్, సాయిబాబా ట్రస్ట్​ కుమ్మక్కయ్యాయి. ట్రస్ట్ కింద మిగులు భూమి కొట్టేసేందుకు చట్టాన్నే దుర్వినియోగం చేశాయి. తాము కొనుగోలు చేసిన భూమిని రెగ్యులరైజ్​ చేయాలని 2005లో బాల సాయిబాబా ట్రస్ట్ అర్జీ పెట్టుకుంది. దీనిపై ఎంక్వైరీ చేసి... ట్రస్ట్​కు ఇవ్వాల్సిన నిబంధనల ప్రకారం రూ.6.56 కోట్లకు 69.10 ఎకరాల్లో 42.03 ఎకరాలను రెగ్యులరైజ్​చేస్తూ జీవో ఇచ్చారు. మిగిలిన 28 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఎవరికెంత స్థలం అనే దానిపై డిటైల్​ ప్లాన్​ను రూపొందించి ఆమోదించింది.

ప్రభాకర్​ రావు ఎంట్రీతో మారిన సీన్.. 

నిజానికి ఎండోమెంట్​యాక్ట్​ ప్రకారం ధార్మిక సంస్థల భూములు అమ్మడానికి వీల్లేదు. అయితే తాము రెగ్యులరైజ్ చేయించుకున్న 42.03 ఎకరాలను అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని  సాయిబాబా ట్రస్ట్​అర్జీ పెట్టుకోగా, దాన్ని అప్పటి ప్రభుత్వం 2006లో రిజెక్ట్​ చేసింది. ఈ క్రమంలోనే మెసర్స్​ భూపతి అసోసియేట్స్​ను నూజివీడు సీడ్స్ కంపెనీకి చెందిన మండవ ప్రభాకర్​రావు టేకోవర్​చేశారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. భూపతి అసోసియేట్స్ తరఫున ఎంటర్ అయిన ఆయన.. సాయిబాబా ట్రస్టుకు ప్రభుత్వం రెగ్యులరైజ్​చేసిన భూమి అక్రమమని, ఆ భూమిని 2000 సంవత్సరంలోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్​తో తాము కొనుగోలు చేశామని, పొజిషన్​లో ఉన్నామని అప్పటి సీసీఎల్​కు 2008లో అర్జీ పెట్టుకున్నారు. అయితే అదీ మూలకు పడింది. తర్వాత 2020లో మరోసారి అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అప్పటి సంబంధిత జిల్లా కలెక్టర్​కు ఆనాటి సీసీఎల్ఏ​లెటర్​రాశారు. 

ఈ వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చేందుకు నివేదిక పంపాలని అప్పటి సీసీఎల్ఏ, మాజీ సీఎస్ 2022లో యూఎల్ సీకి లెటర్​రాశారు. ఆ తర్వాత ఆయన విధుల నుంచి పక్కకు వెళ్లగా.. కొత్తగా వచ్చిన సీసీఎల్​ఏ తగిన యాక్షన్ తీసుకోవాలని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్​ను 2023లో ఆదేశించారు. కలెక్టర్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా.. అదే ఏడాది మే నెలలో సాయిబాబా ట్రస్ట్​కు రెగ్యులరైజ్​చేసిన 42.03 ఎకరాల భూమిని భూపతి అసోసియేట్స్​కు రెగ్యులరైజ్​చేస్తూ సీసీఎల్ఏ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు 2005లో ఇచ్చిన జీవోను సవరిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. దీంతో భూముల స్కెచ్​లు కూడా మారిపోయాయి. అసలు హక్కుదారులకు చెందాల్సిన 15.30 ఎకరాల భూమి మూడు చోట్ల ఉన్నట్టు ప్లాన్​మార్చేశారు. వారి సొంత భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి కంప్లయింట్ అందడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది.