- కొనుగోలు ధర తగ్గింపునకు అప్పుడే ప్లాన్
- ఈ ఏడాది తగ్గిన పంట విస్తీర్ణం
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో పొగాకు రైతులను మళ్లీ ముంచడానికి కంపెనీలు స్కెచ్ వేస్తున్నాయి. గతేడాది బైబ్యాక్ అగ్రిమెంట్ లేకుండా చేశాయి. దీంతో చివరకు పొగాకు క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ. 8 వేల మధ్య రేట్లు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
కంపెనీలు ఈసారి కూడా ఒప్పందాలకు ముందుకు రాకపోవడంతో రైతులు సాగు తగ్గించారు. గతేడాది పొగాకు 3,824 ఎకరాల్లో సాగు చేయగా.. ఈ ఏడాది 2,065 ఎకరాలకు తగ్గించారు. 2026 మార్చి–ఏప్రిల్‌లో కోతకు వచ్చే పంటకు ఇప్పటికీ బైబ్యాక్ లేకపోవడం, పక్కనే ఉన్న మహారాష్ట్రలో 500 ఎకరాలకు ఒప్పందం చేసుకోవడం స్థానిక రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
భారీగా తగ్గిన పొగాకు సాగు
జిల్లాలో మంజీరా తీర ప్రాంతాలైన కల్దుర్కి, రాంపూర్, హంగర్గా, కొప్పర్గా, ఖండ్గావ్, చిన్నమావంది, కందకుర్తి, నీల, బోర్గాం, పోతంగల్‌లోని కొంత భాగం కలిపి 2024 వరకు ప్రతి ఏటా 6 వేల ఎకరాల్లో పొగాకు సాగయ్యేది. లాభదాయకమైన పంటగా గుర్తింపు పొందిన పొగాకు కొనుగోలుకు కంపెనీలు బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకొని మంచి రేట్ చెల్లించేవి. 2024 సీజన్‌లో వీఎస్‌టీ, పీటీపీ, ఆర్‌కేటీ, ఐటీసీ, అలయెన్స్, జఫారుల్లాఖాన్ కంపెనీలు క్వింటాల్‌కు రూ.13,500 తో పాటు రూ.300 బోనస్ ఇచ్చి రైతులను ప్రోత్సహించగా, 2025 సీజన్ రాగానే బై బ్యాక్‌ను తప్పించుకుని రూ. 3 వేల నుంచి రూ. 8 వేల వరకే కొనుగోలు చేశాయి. దీంతో రైతుల ఫిర్యాదుతో కలెక్టర్ జోక్యం చేసుకోవడంతో క్వింటాకు రూ. 10 వేల వరకు చెల్లించి సరకు కొన్నారు. ఈ అనుభవాల కారణంగా ఈ ఏడాది పొగాకు సాగును రైతులు భారీగా తగ్గించారు.
క్రాప్ హాలిడే ఇవ్వమన్నారు
అధిక వర్షాలు కురిసి పొగాకు సాగుకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఈ ఏడాది పొగాకు పంటకు క్రాప్‌హాలిడే ఇస్తామని రైతులు చెప్పారు. అలా వద్దని సూచించడంతో కొందరు సాగు చేస్తున్నరు. బై బ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటలేం. కోతల పరిస్థితి నాటికి రేట్నిర్ణయిస్తాం. మహారాష్ట్రలో 500 ఎకరాల పొగాకు పంటకు మాత్రమే బైబ్యాక్ ఒప్పందం కుదుర్చుకున్నం. - ఖాజా, వీఎస్‌టీ, జిల్లా మేనేజర్
కొనుగోలు గ్యారెంటీ లేకపోతే ఎట్లా?
2025 సీజన్ కోసం ఐదెకరాలు పొగాకు వేసి కొనుగోలు బాండ్ లేక క్వింటాల్ రూ. 3 వేల చొప్పున సరకు అమ్మి నష్టపోయాం. అందుకే ఈసారి పొగాకు జోలికి వెళ్లలేదు. పంట సాగు చేస్తున్న రైతులకు భరోసా కల్పించే ఏర్పాట్లు చేపట్టాలి. లేదంటే కంపెనీ మోసాలకు రైతులు నష్టపోతారు. - షేక్ ఫరీద్, కొప్పర్గా
