100 డేస్ ప్లాన్.. టెన్త్ స్టూడెంట్ల కోసం మిషన్ లక్ష్యం

100 డేస్ ప్లాన్.. టెన్త్ స్టూడెంట్ల కోసం మిషన్ లక్ష్యం
  • గిరిజన సంక్షేమ స్కూళ్ల విద్యార్థులపై ఐటీడీఏ దృష్టి
  • వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రిపరేషన్

ఆసిఫాబాద్, వెలుగు: టెన్త్ క్లాస్ స్టూడెంట్లకు పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వారిపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉట్నూర్​లోని ఐటీడీఏ ఆధ్వర్యం ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేలా ‘మిషన్ లక్ష్యం’ పేరిట పీవో కొత్త ప్రణాళిక రూపొందించారు. 

ఈ ప్రిపరేషన్ ప్లాన్ ను ఐటీడీఏ అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. టెన్త్ స్టూడెంట్లకు ఫైనల్​ఎగ్జామ్ ​మార్కులు కీలకం కానున్న నేపథ్యంలో అందరికీ 10/10 వచ్చేలా చదివిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సెపరేట్ గా క్లాసులు చెప్తున్నారు. వంద రోజుల పాటు ఉండే ఈ ప్లాన్ స్కూళ్లలో ఇప్పటికే ప్రారంభమైంది. 

ఉమ్మడి జిల్లాలో 3,868 మంది స్టూడెంట్స్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 110 ఆశ్రమ పాఠశాలల్లో 3,868 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని  45 ఆశ్రమ స్కూళ్లలో 1685 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 37 స్కూళ్లలో 1312 మంది, నిర్మల్ జిల్లాలో 13 స్కూళ్లలో 439 మంది, మంచిర్యాల జిల్లాలో 15 స్కూళ్లలో 432 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

పకడ్బందీగా ప్రణాళిక

ఉదయం 8  నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు స్టూడెంట్లకు నమునా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు స్టడీ అవర్స్ కోసం టీచర్లను నియమించారు. సమ్మెటివ్ అసైన్ మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు ఆధారంగా స్టూడెంట్లను ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా పాఠాలు బోధిస్తున్నారు. 

డీ గ్రేడ్ విద్యార్థులు కనీసం ఉత్తీర్ణత సాధించేలా ప్రిపేర్ చేస్తున్నారు. ఏ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులు 10/10 జీపీఏ సాధించి  రాష్ట్రస్థాయిలో సత్తా చాటేలా సన్నద్ధం చేస్తున్నారు. అబ్జెక్టివ్ ప్రశ్నలను స్వతహాగా సాధన చేయిస్తున్నారు. విద్యార్థుల పురోగతిపై ఆయా స్కూళ్ల హెచ్​ఎంలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా టీచర్లకు సెలవులు ఇవ్వడం లేదు.

భయం పోవాలి

టెన్త్ ఫైనల్​ ఎగ్జామ్స్ అంటే కొందరికి భయం ఉంటుంది. దానివల్లే పరీక్షలు బాగా రాయక ఫెయిల్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం సాధిస్తారని పేర్కొంటున్నారు. ఇందుకోసం ముందుగా టీచర్లు నిర్వహించే స్లిప్ టెస్టులను మెయిన్ ఎగ్జామ్స్​గా భావించి అటెంప్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఏయే సబ్జెక్టులో వెనకబడిపోతు న్నారో తెలుసుకొని, అందుకనుగుణంగా ప్రిపేర్ అవ్వాలంటున్నారు. డౌట్లు ఉంటే వెంటనే టీచర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని  చెబుతున్నారు. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, పట్టుదలతో చదివేలా టీచర్లు ప్రోత్సాహించాలని సూచిస్తున్నారు.

100 శాతం రిజల్ట్.. 10/10 టార్గెట్

గిరిజన ఆశ్రమ పాఠశాల్లో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నం. స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నం. విద్యార్థులు గైర్హాజరు కాకుండా దృష్టి పెట్టినం. హెచ్ ఎంలు, వార్డన్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాం. 100 రోజుల యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేస్తాం. డీ గ్రేడ్ లో ఉన్న విద్యార్థులపై మరింత దృష్టి పెట్టి ఉత్తీర్ణత సాధించేలా ప్లాన్ అమలు చేస్తున్నం. ఈసారి వందశాతం ఉత్తీర్ణత, 10/10 సాధించడమే టార్గెట్.  - రమాదేవి, డీటీడీవో, ఆసిఫాబాద్