మరో పదేళ్లు మాదే అధికారం : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

మరో పదేళ్లు మాదే అధికారం : మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
  • మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  
  • రాష్ట్రంలో ఎస్సీ వర్గీరకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కృషి చేస్తాం  
  • మిర్యాలగూడ సెగ్మెంట్‌‌‌‌లో  రూ. 171. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

నల్గొండ, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతో మరో 10 ఏండ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.171.50 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు  చేశారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  తెలంగాణ చరిత్రలో నిలబడేలా రాష్ట్రంలో రూ.60 వేల కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లా కార్యకర్తల త్యాగంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 

బీఆర్ఎస్, బీజేపీలను తిట్టేందుకు నోరు రావట్లేదు :మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నాలుగు ముక్కలైందని, ఆ పార్టీలను తిట్టేందుకు నోరు రావట్లేదాని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణలో మరో 15 ఏండ్లు తామే అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.65 వేల కోట్లతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఆర్ అండ్ బీ రహదారులు నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్- - విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు రూ.10,500 కోట్లతో చేపట్టనున్నామని, రూ.7600 కోట్లతో హైదరాబాద్ - చిట్యాల రోడ్డు చేపట్టనున్నామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.250 కోట్లతో హ్యం రోడ్లు మంజూరు చేశామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి రూ.450 కోట్లు, దేవరకొండ నియోజకవర్గానికి రూ.350 కోట్లతో హ్యాం రోడ్లకు టెండర్లు  పిలవనున్నామని వివరించారు.

  రూ.250 కోట్లతో  హ్యాం రోడ్లను మంజూరు చేసినందుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.  నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు శ్రీనివాస్ ఆసుపత్రిలో ఫ్రీజర్ బాక్స్ ఏర్పాటు కు రూ.25 లక్షల చెక్కును మంత్రులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్  వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బీఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ రెడ్డి, అదనపు ఎస్పీ రమేశ్, డీఎస్పీ రాజశేఖర్ రాజు,  స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

మిర్యాలగూడను మొదటి స్థానంలో నిలబెడతాం: మంత్రి ఉత్తమ్

మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెతామని మంత్రి ఉత్తమ్ అన్నారు.  నియోజకవర్గంలో సాగునీరు అందించే  ఆయకట్టులో ఎక్కడా సమస్యలు లేకుండా నీరిస్తామని, మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల  పథకాలను నూరు శాతం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికి  రేషన్ కార్డు ఇవ్వలేదని, తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు.  

ఇంకా మిగిలిపోయి వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు.  ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, రైతుకు న్యాయం చేస్తామన్నారు. ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు.  మిర్యాలగూడ నియోజకవర్గంలో మెయిన్ కెనాల్ లైనింగ్ కి రూ.57 కోట్లు మంజూరు చేస్తున్నట్లు  మంత్రి ప్రకటించారు. వీటితో పాటు  నియోజకవర్గంలోని దుబ్బ తండా, శాంతినగర్, రావులపెంట చెక్ డ్యాంల నిర్మాణానికి రూ.24 కోట్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణానికి రూ.20 కోట్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న 5 లిఫ్ట్ ఇరిగేషన్లను త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.