
- ఎమ్మెల్సీ బై పోల్‌లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది
- సీఈసీకి లేఖ రాసిన రఘునందన్
- 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జ్లకు డబ్బులు బదిలీ
హైదరాబాద్/తూప్రాన్,వెలుగు: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో రూ.30 కోట్లతో ఓట్లు కొనేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌తో పాటు సీఈవో వికాస్ రాజ్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. కెనరా బ్యాంక్‌లోని బీఆర్ఎస్ ఆఫీషియల్ అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్‌చార్జ్‌లకు భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఈ ట్రాన్సాక్షన్‌పై ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేకపోతే కోట్లాది రూపాయలను ఓట్లు కొనేందుకు ఉపయోగిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. బ్యాంకు అకౌంట్ పూర్తి వివరాలతో పాటు ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ను కూడా జత చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక అకౌంట్‌తో పాటు డబ్బులు బదిలీ అయిన ఖాతాలను వెంటనే ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు.