
హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా వర్తింపు: ఎండీ బలరామ్
హైదరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఫ్రీ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్అందిస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 25 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ఉద్యోగులకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా అందిస్తున్నామని తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సాలరీ అకౌంట్ కలిగి ఉన్న ప్రతీ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఈ ఉచిత బీమా అమలవుతుందని సీఎండీ వెల్లడించారు.
మంగళవారం హైదరాబాద్ లోనిసింగరేణి భవన్ నుంచి సంస్థ డైరెక్టర్లు, ఏరియా జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఇప్పటికే సింగరేణి ఎంప్లాయిస్కు ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల నుంచి రూ.కోటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని చెప్పారు. పబ్లిక్సెక్టార్బ్యాంక్ల ద్వారా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ఉద్యోగులకు రూ.50 లక్షల వరకు ప్రమాద బీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి హాస్పిటల్స్లో వైద్య సేవలు అందిస్తున్నామని, వారి కుటుంబాలకు అందించే విషయంపై ఈఎస్ఐ హాస్పిటల్స్ ఆఫీసర్లతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. కొత్తగూడెం, జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్(ఎస్టీపీపీ)లలో ముందు ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తప్పనిసరిగా పీఎఫ్, సీఎంపీఎఫ్, పింఛన్ కోసం జీతంలో కొంత రికవరీ చేసి, కాంట్రాక్టర్ల ద్వారా అంతే మొత్తాన్ని కలిపి జమ చేయాల్సి ఉంటుందన్నారు.
వారికి సంబంధించిన మస్టర్లను వెబ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసే ప్రక్రియను ఆగస్టు నెల నుంచి చేపడుతున్నట్టు సీఎండీ వివరించారు. యాప్ ద్వారా మస్టర్ల నమోదు ఆధారంగా జీతాలు , పీఎఫ్, సీఎంపీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరిగి వారి ఖాతాల్లో జమ చేసే వీలుంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కొత్తగూడెం నుంచి డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వరరెడ్డి, కార్పొరేట్ జీఎంలు, జీఎం(కో ఆర్డినేషన్) జి.దేవేందర్ పాల్గొన్నారు.