బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  30%  లిక్కర్​ షాపులు రిజర్వ్

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు  30%  లిక్కర్​ షాపులు రిజర్వ్

లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసిన ఖమ్మం కలెక్టర్

  • ​    జనరల్ కు 82,  గౌడ్ లకు18 షాపులు కేటాయింపు
  •     2023–25కు సంబంధించి ఇయ్యాల రిలీజ్​కానున్న నోటిఫికేషన్
  •     ఈ నెల 18 వరకు అప్లికేషన్లు స్వీకరణ

ఖమ్మం/ఖమ్మం టౌన్/ భద్రాద్రికొత్తగూడెం,వెలుగు : నూతన మద్యం పాలసీ ప్రకారం ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని వైన్​షాపుల కేటాయింపు కోసం కలెక్టర్లు గురువారం లక్కీ డ్రాల ద్వారా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 122 వైన్ షాపులు నడుస్తుండగా, జనరల్​కేటగిరీకి 70 శాతం, గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం షాపులను కేటాయించారు. 2023 – 2025 సంవత్సరానికి గాను శుక్రవారం నోటిఫికేషన్ ​రిలీజ్ ​కానుంది. ఆ వెంటనే అప్లికేషన్ల స్వీకరణ మొదలవుతుంది. అప్లికేషన్ల ఫీజును ప్రభుత్వం రూ.2 లక్షలుగా నిర్ణయించింది. ఒక్కొక్కరు ఎన్ని అప్లికేషన్లు అయినా వేయొచ్చని గతంలోనే ప్రకటించింది.

ఈ నెల18 సాయంత్రం 6 గంటల వరకు ఖమ్మం ఎక్సైజ్–1 పోలీస్ స్టేషన్, జిల్లా ఎక్సైజ్​సూపరింటెండెంట్ ఆఫీసులో అప్లికేషన్లు తీసుకుంటారు. 21న లక్కీ డ్రా ద్వారా కొత్త లైసెన్స్ దారుల ఎంపిక ఉంటుంది. అందులో షాపు దక్కించుకున్నవారు 24  గంటల్లోపు మొదటి విడత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే లైసెన్స్ ఉన్నవారికి నవంబర్ నెలాఖరు వరకు గడువు ఉంది. 

ఎస్టీలకు మరో రెండు 

ఖమ్మం సిటీలోని డీపీఆర్సీ బిల్డింగులో గురువారం నిర్వహించిన వైన్​షాపుల రిజర్వేషన్ల కేటాయింపు కార్యక్రమంలో కలెక్టర్ వీపీ గౌతమ్, అడిషనల్​కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా ఎక్సైజ్​ సూపరింటెండెంట్ నాగేంద్రరెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.వేణుగోపాల్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ త్రిసభ్య కమిటీ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 122 వైన్ షాపులు ఉండగా, లక్కీ డ్రా ద్వారా కలెక్టర్​ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 షాపులను రిజర్వ్ చేశారు. గౌడ కులస్తులకు18, ఎస్సీలకు 14, ఎస్టీలకు 8 వైన్​షాపులను రిజర్వ్​చేశారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని ఆరు షాపులను ఎస్టీలకు కేటాయించగా లక్కీ డ్రా ద్వారా మరో 2 షాపులను రిజర్వ్​చేశారు.

మిగిలిన 82 వైన్​షాపులను జనరల్ కేటగిరీకి కేటాయించారు. లక్కీ డ్రాలో గౌడ కులస్తులకు 1 , 2, 4, 7, 17, 18, 41, 62, 66, 67, 77, 92, 94, 101, 109, 110, 114, 116 నంబర్​షాపులు, ఎస్సీలకు 13, 24, 25, 26, 34, 49, 71, 78, 82, 86, 87, 97, 99, 111షాపులు, ఎస్టీలకు ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 117, 118, 119, 120, 121, 122 నంబర్​షాపులు రిజర్వ్​అయి ఉండగా, గురువారం 12,  21 నంబర్​షాపులను కూడా రిజర్వ్​చేశారు.

గతేడాది రాష్ట్రంలోనే అత్యధిక టెండర్లు

2021లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చాక నిర్వహించిన టెండర్లలో ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా టెండర్లు దాఖలయ్యాయి. 122 షాపుల కోసం 6,213 అప్లికేషన్లు రాగా, ప్రభుత్వ ఖజానాకు రూ.124.26 కోట్లు జమయ్యాయి. ఏపీ సరిహద్దులో ఉన్న మధిర నియోజకవర్గం రాజుపాలెం వైన్​షాపు కోసం121మంది పోటీపడ్డారు. ఏపీలో మద్యం ధరలు ఎక్కువ ఉండడమే కారణం.

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 44 షాపులు ఎస్టీలకే

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 88 వైన్​షాపుల కోసం గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన లక్కీ డ్రాలో కలెక్టర్​ ప్రియాంక పాల్గొని రిజర్వేషన్లను ప్రకటించారు. ఎస్టీలకు 44 షాపులను, గౌడ్(బీసీ)లకు 6, ఎస్సీలకు 7, జనరల్ కేటగిరీకి 31 షాపులను రిజర్వ్​చేశారు. గెజిట్​సీరియల్ ప్రకారం. 1, 3, 11, 21, 39, 79 నంబర్​షాపులను గౌడ్​లకు, 10,12, 13, 20, 36, 43, 82 షాపులను ఎస్సీలకు కేటాయించారు. 2021లో నిర్వహించిన టెండర్లలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన టెండర్లతో రూ.84 కోట్ల ఆదాయం లభించింది.