మోత్కూరు ‘గురుకులం’లో ఫుడ్ పాయిజన్.. 34 మందికి తీవ్ర అస్వస్థత

మోత్కూరు ‘గురుకులం’లో ఫుడ్ పాయిజన్.. 34 మందికి తీవ్ర అస్వస్థత
  • వాంతులు, విరేచనాలతో 34 మందికి తీవ్ర అస్వస్థత
  • రహస్యంగా ఉంచిన  గురుకుల సిబ్బంది

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా  మోత్కూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్  రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఫుడ్​ పాయిజన్​తో  30 మందికి పైగా  స్టూడెంట్స్​ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్తున్న స్టూడెంట్స్​ను  రాత్రికి రాత్రే పీహెచ్​సీకి  తరలించి ట్రీట్​మెంట్​ ఇప్పించారు. అయితే ఫుడ్ పాయిజన్​ విషయాన్ని సిక్రేట్​గా ఉంచేందుకు ప్రయత్నించినా జిల్లా ఆఫీసర్లు రావడంతో శనివారం మధ్యాహ్నం బయటకు పొక్కింది.  శుక్రవారం రాత్రి వంకాయ కూరతో పాటు  కోడిగుడ్లు ఉడికించి  స్టూడెంట్స్​కు భోజనంలోకి అందించారు. భోజనం చేసిన తర్వాత 8వ తరగతి నుంచి ఇంటర్​ చదువుతున్న 30 మందికి పైగా స్టూడెంట్స్​కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్తుంటే  గమనించిన స్కూల్​ హెల్త్ సూపర్​ వైజర్​ మంగమ్మ, టీచర్స్​ కలిసి 108కు సమాచారం అందించి  రాత్రి 10 గంటల తర్వాత  మోత్కూర్​ పీహెచ్​సీకి తరలించారు. 

డాక్టర్లు ట్రీట్​మెంట్​ అందించి తెల్లవారుజామున 3 గంటలకు  రెసిడెన్షియల్​ కు తరలించారు. హెల్త్​ స్టాఫ్​ పర్యవేక్షణలోనే ఉంచారు.  ఫుడ్​ పాయిజన్​ విషయాన్ని కలెక్టర్​ పమేలా సత్పతికి గురుకులం ప్రిన్సిపాల్​ వెంకటస్వామి  సమాచారం అందించారు. కలెక్టర్ విచారణకు​ ఆదేశించడంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ రజిని, డీసీవో శ్రీరాం శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ వో యశోద, పీవోఎన్సీడీ డాక్టర్ సుమన్ కల్యాణ్ మోత్కూరుకు వచ్చి స్టూడెంట్స్​ ఆరోగ్య పరిస్థితిని ఆఫీసర్లు అడిగి తెలుసుకున్నారు. వంటకాల శాంపిల్స్​ను  ఫుడ్​ సేఫ్టీ స్టాఫ్​ సేకరించి నాచారంలోని టెస్టింగ్​ ల్యాబ్​కు పంపించారు.