ఫ్యూచర్​ సిటీలో ఎలక్ట్రానిక్​ సిటీ.. సిరా నెట్​వర్క్స్, ఎల్​సీజీసీ సంయుక్తంగా రూ.300 కోట్ల పెట్టుబడులు

ఫ్యూచర్​ సిటీలో ఎలక్ట్రానిక్​ సిటీ.. సిరా నెట్​వర్క్స్, ఎల్​సీజీసీ  సంయుక్తంగా రూ.300 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్​ సిటీలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్​ సిటీ (ఇ–సిటీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. శనివారం సెక్రటేరియెట్​లో టెలికం ఉత్పత్తుల సంస్థలు సిరా నెట్​వర్క్స్​(తైవాన్​), ఎల్​సీజీసీ రెజల్యూట్​ గ్రూప్​(తెలంగాణ) సంస్థలతో ఆయన సమావేశమయ్యారు. రెండు సంస్థలు సంయుక్తంగా రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు. ఈ తరహా పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. 

టైర్ -2, టైర్ -3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సిరా నెట్​వర్క్స్, ఎల్​సీజీసీ సంస్థలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 10 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. 

ఇక్కడ 5జీ నెట్ వర్క్స్, మల్టీ లేయర్ నెట్​వర్కింగ్​సొల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారన్నారు. ఈ పెట్టుబడితో ఇండో  తైవాన్ మధ్య సత్సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, సిరా నెట్​వర్కర్స్​ ప్రతినిధులు చుయాన్, జాయ్ భట్టాచార్య, డౌగియాస్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ నుంచి రణ్విందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.