ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 300 మంది యాత్రికులు

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న 300 మంది యాత్రికులు

    
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పితోర్‌గఢ్  జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో 300 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. పెద్ద బండ రాళ్లు, మట్టి ఒక్కసారిగా పడటంతో లిపులేఖ్ – తవాఘాట్ హైవే వంద మీటర్ల వరకు పూర్తిగా దెబ్బతింది. దాంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు వెల్లడించారు. దాని వల్ల దాదాపు 300 మంది యాత్రికులు రోడ్డుపైనే చిక్కుకుపోయారని తెలిపారు. రోడ్డు రిపేరింగుకు రెండు రోజులు పడుతుందని వివరించారు.

 కొండ చరియలు విరిగి పడుతుండటంతో అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్ద్వార్, నైనిటాల్, పితోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తరకాశీ జిల్లాల్లో   వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని హెచ్చరించింది. యాత్రికులు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. గంగోత్రి, యమునోత్రికి వెళ్లే యాత్రికులు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ట్రావెల్ చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో రెయిన్ కవర్, గొడుగు, వెచ్చని దుస్తులను తమతో ఉంచుకోవాలని కోరారు.