ఆసిఫాబాద్​లో 300 గ్రామాలు అవుట్​ ఆఫ్​ కవరేజ్​

ఆసిఫాబాద్​లో 300 గ్రామాలు అవుట్​ ఆఫ్​ కవరేజ్​

ఆసిఫాబాద్, వెలుగు:4జీ నుంచి 5జీ వైపు దేశం పరుగులు పెడుతోంది. కానీ కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని 300 గ్రామాల ప్రజలు మాత్రం కనీసం ఫోన్​ మాట్లాడేందుకు సిగ్నల్స్​ కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు. నెట్​వర్క్​ కవరేజీ సక్రమంగా లేక గ్రామంలోని స్టూడెంట్లు ఆన్​లైన్ క్లాసులకు దూరమవుతున్నారు. అత్యవసర సమయాల్లో కనీసం అంబులెన్సుకు కూడా ఫోన్​ కలవక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇక రేషన్, పింఛన్​కోసం బయోమెట్రిక్​పని చేయక లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని మొత్తం 15 మండలాల్లో ఎక్కువ శాతం మారుమూల పల్లెలు ఉన్నాయి. దహేగం మండలాల్లోని రాంపూర్, మొట్లగూడ, రావులపల్లి, దిగిడ, లోహ, టేపర్ గాం, శంకరపురం, తిర్యాణి మండలంలోని మంగి, రొంపల్లి, మాణిక్యపూర్, భీంపూర్, అస్నోర్, అర్జున్ లొద్ది, పంగిడిమాదర, గుడిపేట్, కొర్లోంక, గోపేర, గోవేన, కౌటగాం, కేరెగూడ, మొహింద, గీసిగూడ, ఎర్ర బండ తదితర సుమారు 300 గ్రామాలకు నెట్​వర్క్​సౌకర్యం లేదు. ఈ గ్రామాల్లో బయట ప్రపంచం నుంచి కమ్యూనికేషన్ కష్టతరంగా మారింది. సెల్ ఫోన్ వినియోగదారులు  నానా అవస్థలు పడుతున్నారు. బయట నుంచి ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే సమాధానం వస్తోంది. ఎమర్జెన్సీలో కాల్ చేయడానికి నెట్​వర్క్​సిగ్నల్ కోసం గుట్టలు, చెట్లు, ఇండ్లు ఎక్కి ప్రయత్నించడం ఇక్కడ సాధారణంగా మారింది. 
అంబులెన్స్ ​సేవల్లో ఆలస్యం
నెట్​వర్క్​సమస్య కారణంగా ఈ ప్రాంత ప్రజలకు అత్యవసర సమయాల్లో అంబులెన్స్ ​సేవలు అందడం లేదు. మారుమూల ప్రాంతాలకు అసలే రోడ్డు సౌకర్యం అంతంత మాత్రంగా ఉంది. ఇక ఫోన్ ​సిగ్నల్ ​లేక మరిన్ని తిప్పలు పడాల్సి వస్తోంది. నెట్​వర్క్ ​కవరేజ్ ఏరియాలోకి వెళ్లి ఫోన్ చేయటానికి కనీసం గంటకు పైగా పడుతోంది. అంబులెన్స్ రావడానికి మరో రెండు గంటల సమయం అవుతోంది. ప్రతిసారి ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ ఈ గ్రామాలకు ఆలస్యంగా చేరుకుంటోంది. తిర్యాణి మండలంలోని కౌటాగౌం గ్రామంలో ఇటీవల ఐదు నెలల చిన్నారి అనారోగ్యానికి గురైంది. అంబులెన్స్​కు ఫోన్​ చేద్దామంటే సిగ్నల్​కలవలేదు. గ్రామానికి రోడ్డు సైతం సక్రమంగా లేదు. దీంతో హాస్పిటల్ లో చేర్పించడం ఆలస్యం కావడంతో తన కూతురిని కోల్పోయానని పాప తండ్రి అమృతరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని జైనూర్ మండలానికి చెందిన చింతకర్ర కిషన్ నాయక్ తండా గ్రామాల గిరిజనులు నెట్​వర్క్​లేక ఎమర్జెన్సీలో అంబులెన్స్ సేవలు పొందలేకపోతున్నారు. గ్రామంలో ఇటీవల గర్భిణిని హాస్పిటల్​కు తరలించడానికి గ్రామస్థులు అతి కష్టం మీద ఎడ్లబండిపై మెయిన్ రోడ్డు వరకు తీసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్​కు ఫోన్​చేసి హాస్పిటల్​కు తరలించారు. 
రేషన్, పింఛన్ కోసం తిప్పలు
రేషన్ బియ్యం, పింఛన్ బయోమెట్రిక్ తో పంపిణీ చేస్తుండడంతో జిల్లాలోని 300 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. రేషన్ బియ్యం కోసం ఫింగర్ ప్రింట్ ఇవ్వడానికి నెట్​వర్క్​కవరేజ్ కోసం గుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ఇక పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు సైతం ప్రతి నెలా మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక ఈ గ్రామాల్లోని స్టూడెంట్లు సైతం ఆన్​లైన్ ​క్లాసులకు దూరమవ్వాల్సి వస్తోంది. గత ఏడాది నెట్​వర్క్​లేక చిన్నారులంతా ఆన్​లైన్ ​క్లాసులకు దూరమయ్యారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి. చాలామందికి  టీవీలు లేక ఫోన్లు ఉన్నవారికి నెట్​వర్క్​ సిగ్నల్ లేక ఇక్కడ ఆన్​లైన్ చదువు ప్రశ్నార్థకంగా మారింది. తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారన్న ఈ ప్రాంతవాసులు రోదన ఎవరికీ పట్టడం లేదు.
సిగ్నల్స్​ లేక తిప్పలు
సిగ్నల్స్​ లేక తిప్పలు పడుతున్నం. ఏదైనా జరిగితే 108 కు సైతం ఫోన్​కలవడం లేదు. ఎన్నోసార్లు లీడర్లు,  ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రోగాలు వస్తే మేమే నడుచుకుంటూ దవాఖానకు వెళ్తాం. కరోనా టైంలో పిల్లలు ఆన్​లైన్​ క్లాసులు విందామన్నా సెల్ ఫోన్​ సిగ్నల్స్ లేక కుదరలేదు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - రాయి సిడం రాంషా, మంగి, తిర్యాణి 

గుట్టలు ఎక్కాలె
మా ఊరు జంగల్ ల ఉంటది. మా ఊర్ల ఏ మొబైల్ నెట్​వర్క్ ఉండదు. సిగ్నల్ కోసం గుట్ట మీదికి లేదంటే వాటర్ ట్యాంక్ ఎక్కాలే. నెట్​వర్క్ లేక బాగా గోస పడుతున్నం. అంబులెన్సుకు ఫోన్ చేద్దామన్నా సిగ్నల్స్ ఉండవు. – ఎండీ మొయిన్, మొట్లగూడ, దహెగాం