
- జిల్లాలో కేంద్ర పథకాల అమలుపై సమీక్ష కరువు
మహబూబాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పర్యవేక్షణ లోపం ఏర్పడుతోంది. వివిధ శాఖల ద్వారా కేంద్రం నుంచి జిల్లాకు రూ.కోట్లలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు సకాలంలో దృష్టి సారించకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో 'దిశా' (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) నిర్ధేశం లేకుండా పోతోంది.
దిశ సమావేశాల జాడ కరువు..
2024 మేలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించారు. జూన్ లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మహబూబాబాద్పార్లమెంట్నియోజకవర్గంలో కాంగ్రెస్‌నుంచి పోరిక బలరాం నాయక్ ఎంపీగా గెలుపొందారు. ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల పరిధిలో దిశ సమావేశం నిర్వహించినా, పార్లమెంట్నియోజకవర్గ కేంద్రమైన మహబూబాబాద్‌లో మాత్రం ఇంతవరకు సమావేశం నిర్వహించ లేదు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి.
వాటి వినియోగం, అర్హులకు పథకాలు అందుతున్నాయా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించలేదు. పార్లమెంటు సభ్యుడి అధ్యక్షతన మూడు నెలలకోసారి నిర్వహించే ఈ సమావేశం ఏడాది దాటినా నిర్వహించ లేదు.
కేంద్రం అమలు చేస్తున్న పథకాలు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ _ గ్రామీణ కౌశల్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, జాతీయ సామాజిక సహాయక పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ, స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జాతీయ గ్రామీణ తాగునీటి పథకం, ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన, సమగ్ర నీటి యాజమాన్య పథకం, డిజిటల్ ఇండియా_ భూమి రికార్డుల నవీకరణ పథకం, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ జాతీయ రూర్బన్ మిషన్, జాతీయ వారసత్వ నగర అభివృద్ధి పథకం, అటల్ మిషన్ ఫర్ రిజ్యువేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, స్మార్ట్ నగర పథకం, ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, జాతీయ ఆరోగ్య మిషన్, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, డిజిటల్ ఇండియా_ పబ్లిక్ ఇంటర్నెట్ సేవలు పథకం, టెలికాం, రైల్వేలు, తపాలా శాఖ, జాతీయ రహదారులు, గనుల శాఖ నిర్వహణ కొనసాగుతుండగా, జిల్లాలో వీటిపై సమీక్ష కరువైంది.
సమీక్షలే కీలకం..
జిల్లా అభివృద్ధిలో కీలకమైన దిశ సమావేశాలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రధానంగా హైవేలు, టెలీకమ్యూనికేషన్, రైల్వే, తపాలా శాఖ, కేంద్రీయ విద్యాలయాల్లో సౌకర్యాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన సమపరిష్కారానికి మంజూరుపై చేసిన తీర్మాణాలను కేంద్ర ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయించుకోవాలి. జిల్లాలో మహబూబాబాద్ లో రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, హైవేల విస్తరణ, నిర్మాణాల పురోగతి, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్సేవల విస్తరణ, అటవీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ సమస్యలు ఉన్నాయి.
త్వరలో దిశ మీటింగ్ నిర్వహణకు చర్యలు
మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కేంద్రమైన మహబూబాద్ జిల్లా పరిధిలో దిశా కమిటీ సమావేశం త్వరలో నిర్వహిస్తాం. పార్లమెంటు సమావేశాలు, ఇతర పని ఒత్తిడితో జిల్లా పరిధిలో సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోయాం. కలెక్టర్, ఇతర అధికారులకు దిశ మీటింగ్ నిర్వహణ కోసం తగిన ఆదేశాలు జారీ చేస్తాం. పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ