
- రంగం సిద్ధం చేస్తున్న అధికారులు
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20,531 అప్లికేషన్లు పెండింగ్
- అఫిడవిట్, రుజువుల అందజేతపై రైతుల్లో టెన్షన్
వనపర్తి, వెలుగు : దశాబ్దాల కిందట తెల్లకాగితాలపై రాసుకున్న భూకొనుగోళ్ల(సాదాబైనామా) సమస్యలకు పరిష్కారం లభించనున్నది. సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. సాదాబైనామా భూములకు పట్టా పాసు పుస్తకాలు లేక సాగు చేసుకుంటున్న రైతులకు బ్యాంకు రుణాలు, రాయితీలు అందక నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 20,531 సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి.
భూభారతిలో సమస్యలకు చెక్..
భూ సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత జూన్‌లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ సదస్సుల్లో సాదాబైనామాలకు దరఖాస్తులు ఇచ్చిన రైతులు ఉన్నారు.
భూ రికార్డుల్లో పేర్లు, భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు తప్పుగా నమోదైతే వాటి సవరణకు గతంలో రైతులు తహసీల్దారు నుంచి కలెక్టర్ వరకు తిరిగి అలసిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ ధరణి చట్టం తీసుకురావడంతో రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం లభించింది. తాజా సాదామైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్జారీ చేసి రైతుల్లో ఆశలు నింపింది.
నిర్ధారిత దరఖాస్తుల క్రమబద్ధీకరణ..
సాదాబైనామాల క్రమబద్ధీకరణ కోసం 2020 అక్టోబర్, 12 నుంచి నవంబర్ 10 వరకు వచ్చిన దరఖాస్తులను క్రమబద్ధీకరించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. భూభారతి చట్టంలోని సెక్షన్-6, బై సెక్షన్(1) ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి ఆర్డీవో విచారణాధికారిగా వ్యవహరించనున్నారు.
అందిన దరఖాస్తుల ఆధారంగా భూమి కొన్న, అమ్మినవారికి నోటీసులు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానిక రైతుల వాంగ్మూలం తీసుకుంటారు. ఈ క్రమంలో దరఖాస్తుదారు తాను భూమిని 2014 కంటే ముందే కొనుగోలు చేసినట్లు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. అన్నింటినీ నిర్ధారించుకున్న తర్వాతే అప్లికెంట్లకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారు.
క్రయవిక్రయాలతో ఆదాయం..
సాదాబైనామా దరఖాస్తుదారులకు భూ యాజమాన్య హక్కులు కల్పిస్తే భూముల క్రయవిక్రయాలు జరుగుతాయి. తద్వారా గవర్నమెంట్‌కు రిజిస్ర్టేషన్లు, మ్యుటేషన్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. క్రమబద్ధీకరణకు నోటిఫికేషన్జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలోని రైతుల ఎదురుచూపులకు తెర పడనుంది.
ప్రక్రియ మొదలు పెడతాం..
సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియను త్వరలోనే మొదలు పెడతాం. పరిశీలన తర్వాత రైతులకు పట్టాదారుపాస్‌పుస్తకాలు అందించేలా చూస్తాం. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనకు తహసీల్దార్లు సిద్ధమయ్యారు.
- సుబ్రహ్మణ్యం, ఆర్డీవో, వనపర్తి
ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదాబైనామాఅప్లికేషన్లు
జిల్లా పెండింగ్ అప్లికేషన్లు
వనపర్తి 8,400
మహబూబ్‌నగర్ 4,217
జోగులాంబ గద్వాల 3,465
నాగర్ కర్నూల్ 2,246
నారాయణపేట 2,203
మొత్తం 20,531