
- పీవీటీజీలకు అండగా ఐటీడీఏ
- సాగునీటి వసతి ఉన్న రైతులకు ఉచితంగా రూ.1500 విలువైన 10 రకాల కూరగాయల విత్తనాలు ఫ్రీగా సప్లై
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 500 మంది ఆదిమ గిరిజనులకు లబ్ధి
ఆసిఫాబాద్, వెలుగు: అభివృద్ధిలో వెనుకబడిన ఆదిమ గిరిజనులు కాయగూరల సాగులో మాత్రం రాణించేలా ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. దీంతో ఆదివాసీ రైతుల చేనుల్లో కూరగాయల సాగు జోరందుకుంటోంది. కాయగూరల సాగుపై మక్కువ చూపుతున్న రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వైపు ప్రయత్నాలు కొనసాగించేలా ఐటీడీఏ సహకారం అందిస్తోంది.
పీవీటీజీలోని కోలాం, తోటి వర్గాలకు చెందిన ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
గిరిజనుల సంస్కృతి, ఆహార అలవాట్లును పరిగణనలోకి తీసుకొని..
దశాబ్ద కాలంపాటు ఐటీడీఏ నిర్వీర్యం కావడంతో గిరిజనులకు పథకాలు పూర్తిగా అందకుండా పోయాయి. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీడీఏకి పూర్వ వైభవం తెచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఆదిమ గిరిజనుల సంస్కృతి, ఆహార అలవాట్లును పరిగణనలోకి తీసుకుని దాని ప్రకారం ఉపాధి కల్పించేలా చూస్తోంది. గ్రామాలు, మండలాల్లో ఉన్న పీవీటీజీ ప్రజలను గుర్తించి వారికి ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా కూరగాయలు పండించేందుకు సహకారం అందిస్తుండడంతో కాయగూరల సాగులో రాణిస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఇస్తోంది.
టమాట, బెండకాయ, వంకాయ..
ఈ సీజన్లోనూ పకడ్బందీగా అమలు చేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి వసతి కలిగిన 500 మంది రైతులకు ఉచితంగా 10 రకాల కూరగాయల విత్తనాలు అందజేస్తున్నారు. ఒక్కో యూనిట్ విలువ రూ.1500 ఉండగా.. 10 రకాల కూరగాయల విత్తనాలు ఉచితంగా అందిస్తున్నారు. పూర్తి సబ్సిడీతో అందించే వాటిలో టమాట, బెండకాయ, వంకాయ, మిర్చి, బీరకాయ, కాకరకాయ, పాలకూర, తోటకూర, ఉల్లిగడ్డ, క్యారెట్ విత్తనాల ప్యాకెట్లు ఉన్నాయి.
కూరగాయల సాగు రైతులకు అదనపు ఆదాయం మాత్రమే కాకుండ కుటుంబానికి పోషకాహారం అందించడంలోనూ సహాయపడుతుందని అధికారులు అంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ గ్రామాల్లో కాయగూరల సాగు మార్పులకు దారితీస్తున్నాయని పేర్కొంటున్నారు.